అన్నదాత సుఖీభవ…రైతులకి వారల జల్లు !

Annadata Sukhibhava Declared In AP

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలపై చర్చించారు. ముఖ్యంగా రైతుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన అన్నాదాత సుఖీభవ విధివిధానాలను ఖరారు చేశారు. ఈ పథకం కింద ప్రతి రైతుకూ రూ.10వేలు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. కేంద్రం ప్రకటించిన రూ.6వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4వేలు ఇవ్వాలని తీర్మానించింది. కేంద్ర పథకానికి అర్హులు కాని రైతులకు పూర్తిగా రూ.10 వేలు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. ఫిబ్రవరి చివరి వారంలో ఇందుకు సంబంధించి చెక్కులు ఇవాలని నిర్ణయించింది. రేపు ఏడు జిల్లాలలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్న నేపధ్యంలో ఈరోజే ఈ పధకానికి ఆమోద ముద్ర వేశారు. ఎన్నికల ఖరీఫ్‌, రబీ రెండు దశలుగా ఒక్కో సీజన్‌కు రూ.5 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. వచ్చే ఖరీఫ్ నుంచి కౌలు రైతులను కూడా ఆదుకునేలా మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయించారు. ఈ మేరకు బడ్జెట్‌లో రూ.5వేల కోట్లను కేటాయించారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో ఫిబ్రవరి నెలాఖరు కల్లా కేంద్రం వేసే రూ.2వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.3వేలు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. 5 ఎకరాల లోపు వారే అర్హులుగా కేంద్రం గుర్తించగా.. రైతులందరికీ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

కేబినెట్‌ భేటీలోని కీలక నిర్ణయాలు:

‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.10వేలు ఇవ్వాలని ప్రాధమికంగా నిర్ణయం. (కేంద్రం ఇచ్చేది కూడా కలిపి). ఖరీఫ్‌లో, రబీలో 2 దశలుగా ఒక్కో సీజన్ కు రూ.5వేల చొప్పున ఇస్తారు.
కౌలు రైతులకు కూడా ఖరీఫ్ నుంచి ఇచ్చి ఆదుకునేలా మార్గదర్శకాలు.
ఫిబ్రవరి చివరలోనే ‘అన్నదాత సుఖీభవ’ చెక్కుల పంపిణీ.
రైతు రుణ మాఫీ చెల్లింపులు కూడా వెంటనే చేపట్టాలని నిర్ణయం.

పేదలకు ఇళ్లపట్టాలు :

ప్రభుత్వ భూముల్లో 92,960 ఇళ్ల పట్టాలు పంపిణీకి సిద్దంగా ఉన్నాయి. క్రమబద్దీకరణ కింద మరో 5,074 ఇళ్ల పట్టాలు (డ్వెల్లింగ్ యూనిట్స్) పంపిణీకి సిద్దంగా ఉన్నాయి.

డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు :

డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలన్న నిర్ణయంపై మంత్రిమండలిలో ఆమోదం.
సిమ్ కార్డుతో పాటు 3ఏళ్లు కనెక్టివిటీ ఇచ్చేలా నిర్ణయం.

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మండలి ఏర్పాటు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మండలి ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం. వ్యవసాయ, ఉద్యానవనాల విద్య క్రమబద్ధీకరణకు ఉద్దేశించి ఈ మండలి ఏర్పాటు. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో తరహా ఈ మండలిని ఏర్పాటుచేస్తున్నారు.
ఇకపై అగ్రికల్చర్, హార్టీకల్చర్ ప్రాక్టీషనర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లుకు మంత్రిమండలి ఆమోదం. వ్యవసాయ, హార్టీకల్చర్ ప్రాక్టీషనర్ల సర్వీసులను పర్యవేక్షించే వ్యవస్థ ఇప్పటివరకు లేదు.
వ్యవసాయ విద్య మరింత నాణ్యత, నైపుణ్యత, సాంకేతికతతో కూడిన విధంగా చేయడానికి ఈ మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయం.
వ్యవసాయ విద్యలో డిగ్రీ పూర్తి చేసిన వారి సర్టిఫికేట్లు పరిశీలించి నకిలీ సర్టిఫికేట్లను ఏరివేసే కార్యక్రమం కూడా మండలి చేపడుతుంది.
వ్యవసాయ కోర్సులను నిర్వహించే కళాశాలలకు సరైన మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా సక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నారా లేదా సర్టిఫికేట్లు సక్రమంగా ఇస్తున్నారా లేదా తదితర అంశాలను తనిఖీ చేసే పూర్తి అధికారం వ్యవసాయ మండలికి ఉంటుంది. ఇది చట్టబద్ధత కల్గి ఉంటుంది.
ప్రభుత్వ గుర్తింపు పొందే కళాశాలలను ఈ మండలి సిఫారసు చేస్తుంది.
వ్యవసాయ ఉద్యాన విద్యలో ప్రమాణాలు మరింత పెరగడానికి కొత్తగా ఏర్పాటయ్యే మండలి ప్రత్యేక దృష్టిసారిస్తుంది.

పోలవరం DPR-2కు CWC ఆమోదంపై చర్చ:

రివైజ్డ్ DPR పూర్తిగా ఆమోదించేలా చూడాలన్న సీఎం. చింతలపూడి ఎత్తిపోతల నుంచి నీటిని అందించడంపై చర్చ. ‘ఆస్తులు కల్పించాం, వాటిని ప్రజోపయోగం చేయాలి, నీటిని అందించడంపైనే దృష్టిపెట్టాలి. ప్రత్యామ్నాయాలను అద్యయనం చేయాలి’ అని ముఖ్యమంత్రి సూచన. అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సాగునీటి కొరత లేకుండా చేయాలని ఆదేశం.
కంటింజెన్సీ ఉద్యోగుల జీతాల పెంపు :
పంచాయతీలలో కంటింజెన్సీ ఉద్యోగులకు జీతాల పెంపుపై నిర్ణయం.

DSC 1998 క్వాలిఫైడ్లకు శుభవార్త :

1998లో DSCలో క్వాలిఫైడ్ అయిన 36 మందిని సెకండరీ గ్రేడ్ టీచర్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలని మంత్రిమండలి నిర్ణయం. దీంతో సుదీర్ఘంగా ఉన్న 1998 DSC పెండింగ్ డిమాండ్ పరిష్కారం అయినట్టే.
అలాగే, 2008లో DED, BED అర్హతల విషయంలో అనర్హులై పెండింగ్‌లో ఉన్న వారికి కూడా కాంట్రాక్టు పద్ధతిలో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించే విషయాన్ని పరిశీలించాలని నిర్ణయం.
స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు :
1983-96 మధ్యలో నియమితులైన స్పెషల్ టీచర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, భాషా పండితులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయం. వీరికి నెలకు రూ.398 కన్సాలిడేటెడ్‌గా చెల్లిస్తున్నారు.

మరో 22 ఆస్పత్రుల స్థాయి పెంపు :

31 ఆస్పత్రుల అప్‌గ్రెడేషన్, మిగిలిన 22 హాస్పటల్స్ అప్‌గ్రెడేషనుపై కేబినెట్ నిర్ణయం.

ఐఎఎస్, ఎన్టీవోలకు ఇళ్ల స్థలాలు :

ఐఏఎస్ అధికారులు, ఎన్జీవోలు, ఉద్యోగులకు ఇళ్ల ప్లాట్ల అంశంపై కేబినెట్ నిర్ణయం.

పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటు :

శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం, తిరుపతి ఆధ్వర్యంలో 9 పశుసంవర్థక పాలిటెక్నిక్‌లు, 9 ఫిషరీస్ పాలిటెక్నిక్‌ల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం.