ఆమంచి షాక్…చీరాలకి ‘కరణమే’ !

Karanam Balaram Flexi Controversy In Chirala

రావెల కిషోర్ బాబు, మేడా మల్లిఖార్జున రెడ్డి బాటలోనే.. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేశారు. కొద్దిరోజుల క్రితం ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరతారంటూ వార్తలొచ్చాయి. దీంతో అలెర్ట్ అయిన టీడీపీ అధిష్టానం ఆమంచిని బుజ్జగించే ప్రయత్నం చేసింది. దానిలో భాగంగానే ఆమంచి, సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అయితే భేటీ అనంతరం ఆమంచి టీడీపీలో కొనసాగేది లేనిది రెండు, మూడు రోజుల్లో ఆలోచించి చెప్తానని అన్నారు. దీంతో ఆమంచి టీడీపీని వీడటం ఖాయమనే అభిప్రాయానికి వచ్చింది అధిష్టానం. అనుకున్నట్టుగానే ఆమంచి ఈరోజు టీడీపీకి రాజీనామా చేసారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబుకి లేఖ రాశారు. ‘చీరాల నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో.. ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేని కొన్ని శక్తులు ప్రభుత్వ కార్యకలాపాల్లో ప్రభావాన్ని చూపడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు’ లేఖలో పేర్కొన్నారు. టీడీపీకి రాజీనామా చేసిన ఆమంచి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని జగన్ నివాసమైన లోటస్‌పాండ్‌లో జగన్ ను కలిసారు.

ఈ రోజు సాయంత్రం లేదా రేపు జగన్ సమక్షంలో ఆమంచి వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చీరాల వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని సీనియర్‌ నేత కరణం బ‌ల‌రాంను పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. దీంతో స్థానిక నేతలతో ఆయన సమావేశం కానున్నారు. మరోవైపు ఇప్పుడు చీరాలలో టీడీపీ అభ్య‌ర్ది ఎవ‌రనే చ‌ర్చ మొద‌లైంది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుండి పోటీ చేసి ఓడి.. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీత టీడీపీ అభ్య‌ర్దిగా ప్ర‌క‌టించాలా లేక క‌ర‌ణం బ‌ల‌రాం త‌న‌యుడికి అవ‌కాశం ఇవ్వాలా అనే దాని పై టీడీపీ అధినాయ‌క‌త్వం ఆలోచ‌న చేస్తోంది. క‌ర‌ణం బ‌ల‌రాం ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉండ‌గా, ఆయ‌న త‌న‌యుడు గ‌త ఎన్నిక‌ల్లో అద్దంకిలో పోటీ చేసి ఓడారు. గ‌త ఎన్నిక‌ల్లో అద్దంకి నుండి గెలిచి టీడీపీలో చేరిన గొట్టిపాటి ర‌వి కుమార్ ప్ర‌స్తుతం టీడీపీ అభ్య‌ర్దిగా బరిలోకి దిగుతున్నారు. దీంతో చీరాల లో ఎవ‌రికి అవ‌కాశం ఇస్తార‌నే దాని పై త‌ర్జ‌న భ‌ర్జ‌న లు జ‌రుగుతున్నాయి. ఈ నేపధ్యంలో కరణం బలరామ్‌కు స్వాగతం పలుకుతూ ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని పలు కూడళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో ఆయన చీరాలకు వెళ్లే ప్రయత్నంలో ఉండగా చీరాల పట్టణంలో పలుచోట్ల బలరామ్‌కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు వెలిశాయి.