శ్రీకాకుళంలో మరో పడవ బోల్తా…ఐదుగురు గల్లంతు

another boat accident At Srikakulam

ఆంధ్రప్రదేశ్‌లో వరుస పడవ ప్రమాదాలు విషాదాన్ని నింపుతున్నాయి. తూర్పూగోదావరి జిల్లా పశువుల్లంక పడవ బోల్తా ఘటన మరవకముందే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మరో పడవ బోల్తా పడింది. ఎనిమిది మంది మత్స్యకారులతో వెళ్తున్న పడవ సముద్ర తీరంలో బోల్తా పడింది. ముగ్గురు మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా, ఐదుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. సంతబొమ్మాలి మండలం ఉమిలాడ తీరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వీరంతా పది రోజుల క్రితం పారాదీప్ ప్రాంతానికి చేపల వేటకు వెళ్లారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీస్, రెవెన్యూ అధికారులు సముద్ర తీరంలో గాలింపు చర్యలు చేపట్టాయి. గల్లంతైన వారు పూసపాటిరేగ మండలం చింతపల్లికి చెందిన వారుగా గుర్తించారు. మసీన్(డ్రైవర్), బర్రి మాతయ్య, బర్రి, నర్సమ్స, మైలపల్లి శ్రీను, నరసింహ గల్లంతవగా… అమ్మోరు, ఎర్రయ్య, తాతాయ్య అనే మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు పడవ బోల్తా ఘటన పై ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు.గల్లంతైన వారి ఆచూకీని కనుగొనాలని.. బాధితులకు సాయం చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.