Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ యంగ్ హీరో నాని ప్రయాణిస్తున్న కారు రెండు వారాల క్రితం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో ప్రమాదంకు గురైన విషయం తెల్సిందే. ‘కృష్ణార్జున యుద్దం’ చిత్రం షూటింగ్ ముగించుకుని త్లెవారు జామున ఇంటికి వెళ్తున్న నాని కారు ప్రమాదంకు గురైంది. ఆ ప్రమాదంలో డ్రైవర్ మరియు నాని స్వల్పంగా గాయపడ్డారు. నాని కారు ప్రమాదం గురించి మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. మొదట నాని ఆ కారులో లేడని, ఆయన తండ్రి ఉన్నాడని అన్నారు. ఆ తర్వాత నాని కారు డ్రైవింగ్ చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. తాను డ్రైవింగ్ చేస్తున్నట్లుగా మీడియాలో వచ్చిన వార్తలను నాని కొట్టి పారేశాడు.
నాని యాక్సిడెంట్ గురించి మీడియాలో మరో ఆసక్తికర వార్త ఒకటి ప్రచురితం అయ్యింది. ఒక ఆంగ్ల దిన పత్రికలో నాని యాక్సిడెంట్‌కు సంబంధించిన వార్త సినీ వర్గాల వారి దృష్టిని ఆకర్షించింది. యాక్సిడెంట్లో నాని ముందు పన్ను విరిగిందని, కృత్రిమ పన్నును నాని పెట్టించుకున్నాడు అంటూ సదరు కథనంలో పేర్కొనడం జరిగింది. అయితే తాజాగా నాని ‘అ!’ చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ సమయంలో నాని పళ్లు అంతా సరిగానే ఉన్నట్లుగా అనిపించాయి. ఇక నాని పన్ను విరిగిన విషయంపై ఆయన స్వయంగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. యాక్సిడెంట్ గురించి మీడియాలో వస్తున్న వార్తలను కొట్టి పారేసేందుకు నాని స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.