తెలంగాణాలో కాంగ్రెస్ కి మరో షాక్…మర్రి కూడా ?

Another shock to congress in telangana

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం బతికి బట్టకట్టే పరిస్థితులు కనిపించడం లేదు. తెలంగాణలో ఎలాగైనా బలోపేతం కావాలని గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీ ఆ దిశగా వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా ముందుగా కాంగ్రెస్‌‌పై దృష్టిసారించింది. తాజాగా మరో సీనియర్ నేత కూడా బీజేపీలో చేరడానికి రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అలాగే మాజీ ఉపముఖ్యమంత్రి భార్య కూడా బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. గతంలో బీజేపీ కండువా కప్పుకొని సాయంత్రానికే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిన మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని మళ్లీ బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు కాంగ్రెస్‌కు చెందిన మరికొందరు సీనియర్ నేతలు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు కూడా బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. బీజేపీలో చేరిక అంశంపై ఆ పార్టీ నేత రామ్ మాధవ్‌తో కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ నెల 6న బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన సమక్షంలోనే వీరంతా కాషాయ కండువా కప్పుకొంటారని అంటున్నారు. మరింత మంది కాంగ్రెసు నేతలు కూడా బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆరోజునే పలువురు కాంగ్రెసు నేతలు కమలం గూటికి చేరుకుంటారని భావిస్తున్నారు.