తెలుగు రాష్ట్రాలకి కొత్త గవర్నర్ లు…నరసింహన్ కి కీలక పదవి

New governers to telugu states

రాబోయే మూడు నెలల్లో తొమ్మిది రాష్ట్రాల గవర్నర్లు పదవీ విరమణ చేయబోతున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ కూడా ఉన్నారు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, గోవా, నాగాలాండ్‌, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల గవర్నర్ల ఐదేళ్ల పదవీ కాలం వచ్చే మూడు నెలల్లో ముగియనున్నది. దీంతో మోడీ ప్రభుత్వం బిజెపి సీనియర్‌ నేతలు సుష్మా స్వరాజ్‌, సుమిత్రా మహాజన్‌ లను ఖాళీ అయిన రాష్ట్రాలకు గవర్నర్లుగా పంపేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటితో పాటే ఖాళీగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌, మిజోరం తదితర రాష్ట్రాలకు గవర్నర్‌లను నియమించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు వేర్వేరు గవర్నర్లను నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రెండు రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న ఉమ్మడి గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ పదవీ విరమణ తరువాత రెండు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లను నియమిస్తారు. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు మోడీ సర్కార్‌ 12 మంది జాబితాను తయారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న గవర్నర్లను మళ్లీ నియమించేందుకు మోడీ సర్కార్ మొగ్గుచూపటం లేదు. కానీ ఆగస్టులో పదవీ విరమణ చేయనున్న కేరళ గవర్నర్‌ పి.సథాశివం(70)ను తిరిగి నియమించే అవకాశాలున్నాయి. నలుగురు గవర్నర్లు జులై, ఆగస్టుల్లో పదవీ విరమణ చేయనుండగా, ఒకరు సెప్టెంబర్‌లో రిటైర్‌ కానున్నారు.  మరో ముగ్గురు గవర్నర్ల పదవీ కాలం 2020 దాకా ఉంటుంది. కేంద్ర మాజీ మంత్రులు సుష్మా స్వరాజ్‌, ఉమాభారతి, లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ పేర్లు వినిపిస్తున్నాయి. సుష్మా స్వరాజ్‌ ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా నియమించనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. గత నెలలో ఆమె ఏపి గవర్నర్‌గా నియమితులయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్‌ అభినందనలు కూడా తెలుపుతూ ట్వీట్‌ చేశారు. అది వైరల్‌ అవ్వడంతో కొద్ది సేపటికే ఆ ట్వీట్‌ను తీసేశారు. సుష్మా స్వరాజ్‌ కూడా ఆ వార్తలను కొట్టిపారేశారు. సుమిత్రా మహాజన్‌ గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. కనుక ఆమె కూడా గవర్నర్‌ గా బాధ్యతలు చేపట్టే అవకాసం ఉంది. ఇక నరసింహన్ కి కీలక పదవి కట్టబెట్టనున్నట్టు సమాచారం. ప్రస్తుత గవర్నర్‌ దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్నారని, ఆయనను ఇంకా కొనసాగించడం బాగుండదన్న ఉద్దేశంతో హోంశాఖ ఉన్నట్లు తెలుస్తోంది. నరసింహన్‌ను బదిలీ చేయడమో, జమ్మూ కశ్మీర్‌ వ్యవహారాల సలహాదారుగా నియమించడం జరుగుతుందని హోంశాఖ వర్గాల నుండి అందుతున్న సమాచారం.