Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సినిమా పరిశ్రమ వారు రాజకీయాల్లోకి వెళ్లడం సౌత్‌లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. తెలుగు, తమిళం, కన్నడం ఇలా అన్ని సౌత్ భాషల హీరోలు మరియు హీరోయిన్స్ కూడా రాజకీయాల్లో రాణించిన దాఖలాలు ఉన్నాయి. సినీ పరిశ్రమ వారు తమిళనాడు రాజకీయాల్లో ఎక్కువగా ప్రభావం చూపినట్లుగా ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి అర్ధం చేసుకోవచ్చు. తమిళ ప్రజలు అక్కడ సినిమా స్టార్స్‌ను తమ పాలకులుగా అంగీకరిస్తారు. అందుకే ఎక్కువ శాతం తమిళ స్టార్స్ రాజకీయాలపై ఆసక్తిని కనబర్చుతూ ఉన్నారు. అయితే గత కొంత కాలంగా రాజకీయాల్లోకి సినిమా స్టార్స్ వలస తగ్గింది. కాని ఎప్పుడైతే తమిళ నాడు ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిందో అప్పటి నుండి వెంట వెంటనే సినిమా స్టార్స్ రాజకీయ ప్రకటనలు చేస్తూ వస్తున్నారు.
దశాబ్ద కాలంగా రాజకీయాల్లోకి రావాలా వద్దా అన్న సందేహంలో ఉన్న రజినీకాంత్ ఎట్టకేలకు రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా ప్రకటించాడు. ఆ వెంటనే కమల్ హాసన్ రాజకీయ ప్రకటన వచ్చింది. తాను ప్రజలకు సేవ చేసేందుకు కొత్త పార్టీ పెట్టబోతున్నట్లుగా కమల్ చెప్పుకొచ్చాడు. వీరిద్దరితో పాటు తనవంతు సేవ ప్రజలకు చేయాలనుకుంటున్నట్లుగా విశాల్ ముందుకు వచ్చాడు. ఇటీవల జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రయత్నించాడు. కాని కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఇప్పుడు మరోస్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఆయన కొత్త పార్టీ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక చాలా కాలంగా తమిళ స్టార్ హీరో అజిత్‌ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఆయన అభిమానులు కోరుతున్నారు. కాని ఆయన మాత్రం ఆసక్తిగా లేడు. సినిమాలతో బిజీగా ఉన్న ఆయన త్వరలోనే రాజకీయాల్లోకి వస్తాడని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తమిళ రాజకీయాల్లోకి సినీ ప్రముఖులు క్యూ కట్టడంతో వచ్చే ఎన్నికలు రసవత్తరంగా సాగబోతున్నాయని రాజకీయ వర్గాల వారు అంటున్నారు.