ముద్దుకృష్ణ‌మ హ‌ఠాన్మ‌ర‌ణంపై టీడీపీ దిగ్భ్రాంతి

TDP senior leader gali muddu Krishnama Naidu is dead

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టీడీపీ సీనియ‌ర్ నేత గాలిముద్దు కృష్ణ‌మ‌నాయుడి హ‌ఠాన్మ‌ర‌ణం ఆ పార్టీ శ్రేణుల్ని, నేత‌ల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ప‌లువురు నేత‌లు ఆయ‌న‌తో అనుబంధం త‌ల‌చుకుని కంట‌త‌డి పెడుతున్నారు. 71 ఏళ్ల గాలి ముద్దుకృష్ణ‌మ మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి క‌న్నుమూశారు. ముద్దుకృష్ణ‌మ మూడు నెలల క్రితం గుండె ఆప‌రేష‌న్ చేయించుకున్నారు. అప్ప‌టినుంచి ఆయ‌న ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే ఆయ‌న‌కు నాలుగురోజుల క్రితం డెంగ్యూ జ్వ‌రం రావ‌డంతో కుటుంబ‌స‌భ్యులు హైద‌రాబాద్ లోని ఓ ప్ర‌యివేట్ ఆస్ప‌త్రిలో చేర్పించారు. అక్క‌డ చికిత్స‌పొందుతూ ఆయ‌న హ‌ఠాన్మ‌రణం చెందారు.

ముద్దుకృష్ణ‌మ 1947 జూన్ 9న చిత్తూరు జిల్లా రామ‌చంద్రాపురం మండ‌లం వెంక‌ట్రామ‌పురంలో జి. రామానాయుడు, రాజ‌మ్మ దంప‌తుల‌కు జ‌న్మించారు. బీఎస్సీ, ఎంఏతో పాటు లా డిగ్రీ ప‌ట్టా పొందారు. గుంటూరు జిల్లా లోనిపెద‌నందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో లెక్చ‌ర‌ర్ గా ప‌నిచేశారు. ఎన్టీఆర్ పిలుపుతో 1983లో ముద్దుకృష్ణ‌మ రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం చేశారు. ఉమ్మ‌డి ఏపీలో పుత్తూరు నుంచి ఆరుసార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హించారు. విద్య‌, అట‌వీశాఖ‌, ఉన్న‌త‌విద్యామంత్రిగా సేవ‌లందించారు. తెలుగుదేశంతో విభేదించి కాంగ్రెస్ లో చేరిన ముద్దుకృష్ణ‌మ 2004లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008లో తిరిగి సొంత‌గూటికి చేరుకున్నారు.

2009 ఎన్నిక‌ల్లో న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందిన ముద్దుకృష్ణ‌మ 2014 ఎన్నిక‌ల్లో మాత్రం వైసీపీ అభ్య‌ర్థి రోజా చేతిలో ఓట‌మి పాల‌య్యారు. ప్ర‌స్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. తాను ప్రాతినిధ్యం వ‌హించిన పుత్తూరు, న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఎంత‌గానో అభివృద్ధి చేశారు. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌డంలో ఆయ‌న‌ది ప్ర‌త్యేక శైలి. తెలుగు రాష్ట్రాల్లో ఆయ‌న అంద‌రికీ సుప‌రిచితులు. పార్టీల‌క‌తీతంగా ఆయ‌న‌కు మిత్రులు ఉన్నారు. ముద్దుకృష్ణ‌మ మ‌ర‌ణంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తంచేశారు. తాను పాల్గొనాల్సిన అన్ని స‌మావేశాలు, కార్య‌క్ర‌మాలు ర‌ద్దుచేసుకున్నారు.