ప్రతి ఏడాది అక్కినేని ఇంటర్నేషనల్ పౌండేషన్ ట్యాలెంటెడ్ స్టార్లను ప్రతిష్టాత్మక ఏఎన్నార్ జాతీయ అవార్డు తో సత్కరిస్తోన్న సంగతి తెలిసిందే. 2017 సంవత్సరానికి దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ అవార్డు ను అందుకున్నారు. అయితే గత ఏడాది అనివార్య కారణాల వల్ల అవార్డు ను ప్రకటించ లేదు. తాజాగా 2018-2019 సంవత్సరాలకు గాను అవార్డుల ను ప్రకటించింది. 2018 ఏడాదికిగాను దివంగత అందాల తార శ్రీదేవి కి.. 2019 ఏడాది గాను బాలీవుడ్ వెటరన్ నటి రేఖ కు అక్కినేని అవార్డును అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ అవార్డుకు సంబంధించిన వివరాలను అక్కినేని నాగార్జున కళా బంధు టీ. సుబ్బరామిరెడ్డి తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో వెల్లడించారు.
నవంబర్ 17న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అవార్డులు ప్రదానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరై ఆయన చేతుల మీదుగా అవార్డులు అందజేయనున్నట్లు నాగార్జున తెలిపారు. అలాగే అదే రోజున అన్నపూర్ణ స్టూడియోస్ లో అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా మూడో కాన్వకేషన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రేఖ ముఖ్య అతిధిగా విచ్చేస్తారని తెలిపారు.
సినీ పరిశ్రమ కు ఏఎన్నార్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది సినీ పరిశ్రమ లో ప్రముఖులను సత్కరిస్తున్నారు. 2006లో ఈ అవార్డు ను ప్రవేశ పెట్టారు. తొలిసారిగా దేవ్ ఆనంద్ ఈ అవార్డు అందుకున్నారు. 2017లో దర్శకుడు రాజమౌళి అందుకున్నారు. 2018 పురస్కారం శ్రీదేవికి 2019 పురస్కారం రేఖకు దక్కడం విశేషం. వరుస సంవత్సరాల్లో మేటి నటీమణుల కు ఈ పురస్కారం దక్కడం ఆసక్తి కరం.