కోహ్లి రాసిన లేఖ

కోహ్లి రాసిన లేఖ

టి20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోనున్నట్లు విరాట్‌ కోహ్లి ప్రకటించిన సంగతి తెలిసిందే. టి20 ప్రపంచకప్‌ 2021 తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు కోహ్లి పేర్కొన్నాడు. కోహ్లి నిర్ణయంపై చాలా మంది అభిమానులు ఆశ్చర్యపోయారు. బీసీసీకి ఈ విషయం తెలిపిన తర్వాత సుధీర్ఘ లేఖను విడుదల చేశాడు.

అయితే కోహ్లి నిర్ణయంపై విరాట్ భార్య.. హీరోయిన్‌ అనుష్క శర్మ స్పందించారు. కోహ్లి రాసిన లేఖను షేర్‌ చేస్తూ కేవలం ”లవ్‌ ఎమోజీ” సింబల్‌ను జత చేసింది. తన భర్త ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే తీసుకుంటాడని.. అతని నిర్ణయం నాకు సంతోషమేనని చెప్పకనే చెప్పింది.ఇక కోహ్లి రాసిన లేఖ సారాంశం ఈ విధంగా ఉంది.

” భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా నాయకత్వం కూడా వహించే అదృష్టం నాకు దక్కింది. సారథిగా ఉన్న నాకు ఈ ప్రయాణంలో సహకరించిన సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, సెలక్షన్‌ కమిటీ, కోచ్‌లతో పాటు జట్టు గెలవాలని కోరుకున్న ప్రతీ భారతీయుడికి నా కృతజ్ఞతలు.గత 8–9 ఏళ్లుగా మూడు ఫార్మాట్‌లలో ఆడుతూ 5–6 ఏళ్లుగా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న నాపై తీవ్ర పనిభారం ఉంది.

దీనిని అర్థం చేసుకోవడం అవసరం. భారత టెస్టు, వన్డే జట్టు కెప్టెన్‌గా నా బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించేందుకు నాకు కొంత ఉపశమనం అవసరం. సారథిగా జట్టుకు నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన నేను, ఇకపై టి20 బ్యాట్స్‌మన్‌గా కూడా అదే తరహాలో శ్రమిస్తాను. ఈ నిర్ణయం తీసుకునేందుకు నాకు చాలా సమయం పట్టింది. మున్ముందూ భారత జట్టుకు నా సేవలు అందిస్తూనే ఉంటాను.” అని చెప్పుకొచ్చాడు.