ఏపీ అసెంబ్లీ వాయిదా….అందుకేనట…!

Ap Assembly Budget Session Postponed Likely To Start From Feb 4

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాలు ఈ నెల 30 నుంచి వ‌చ్చే నెల 7 వ‌ర‌కూ వారం పాటు జ‌రుగుతున్నాయ‌ని ముందుగా నోటిఫికేషన్ విడుదల చేసి ప్ర‌క‌టించారు. కానీ ఇప్పుడా అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. సమావేశ తీదేల్లో మార్పులు సూచిస్తూ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేశారు. వ‌చ్చే నెల 4 నుంచి 11 వ‌ర‌కూ సమావేశాలు జ‌రుగుతాయని ఈ నోటిఫికేషన్ స్పష్టం చేసింది. తేదీల మార్పు వెన‌క రాజ‌కీయ కార‌ణాలున్నాయా లేక ఇంకేమైనా అంశాలు ఉన్నాయా అనే అనుమానాలు రేగుతున్నాయి. రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌లే పెన్ష‌న్ల‌ను రూ. 2 వేల‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి కానుక‌గా పెన్షన్లు పెంచుతున్న‌ట్టు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించారు. ఈ రెట్టింపు పెన్ష‌న్ల‌ను వ‌చ్చే నెల నుంచే పంపిణీ చేస్తున్నారు. ఈ ప‌థ‌కాన్ని మ‌రింత విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంతోపాటు, స‌మ‌ర్థంగా అమ‌లుచేసి తీరాల‌నే ల‌క్ష్యంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఉంది. పెన్షన్లు ఇచ్చే మొదటి మూడు రోజులు అంటే వ‌చ్చే నెల 1 నుంచి 3 వ‌ర‌కూ మూడు రోజుల‌పాటు ఈ పెన్ష‌న్లకు సంబంధించిన అంశాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలంటూ ఎమ్మెల్యేలందరికీ ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

కాబట్టి, ఎమ్మెల్యేలంతా స్థానికంగా వారి వారి నియోజ‌క వ‌ర్గాల్లో ఉండి అక్కడి గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాల్సిన అవసరం ఉంది. కాబ‌ట్టి, 30 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు పెట్టుకుంటే స్థానికంగా గ్రామ‌స్థాయికి వెళ్లే ఎమ్మెల్యేలు ఎవ్వ‌రూ ఉండ‌రు. అందుకే, స‌మావేశాల‌ను 4కి వాయిదా వేశార‌ని భావిస్తున్నరు. అయితే ఈ పధకం ఒక్కటే కాక వోట్లను కొల్లగొట్టే ఎన్నో పధకాలను ప్ర‌క‌టించే దిశ‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం సమాలోచనలు జరుపుతోంది. రానున్న సోమవారం జరగనున్న మంత్రి మండలి సమావేశాల్లో రైతుల పెట్టుబడి పధకానికి సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తీసుకునే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది. అదీకాక రాబోయే అసెంబ్లీ స‌మావేశాలు చివరివి కాబోతున్నాయి కాబ‌ట్టి, వీట‌న్నింటినీ సగర్వంగా చెప్పుకునేందుకు వీలుగానే స‌భా నిర్వ‌హ‌ణ తేదీల‌ను మార్చుకున్న‌ట్టు భావిస్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఎంటంటే ఇవే చివరి సామావేశాలు కావడంతో ఇన్నాళ్ళు సభకు దూరంగా ఉన్న వైసీపీ కూడా ఈ సభలో పాల్గొననుంది. ఒకపక్క తమ సంక్షేమ పధకాలను వివరించేందుకు ఏపీ అధికార పార్టీ సిద్దం అవుతుంటే మరోపక్క ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతిపక్ష పార్టీ సిద్దం అవుతోంది.