ఏపీకి వెళ్ళే బస్సులు ఆపే కుట్ర…తస్మాత్ జాగ్రత్త !

ఎన్నికల కోసం ఎన్నికల సమయంలో ఏపీకి వెళ్లే బస్సులు సజావుగా చేరుతాయా? సొంతూర్లకు సకాలంలో వెళ్లి ఓటు వేయాలని ఆశపడుతున్న ఆంధ్రా ఓటర్ల కల నెరవేరుతుందా అంటే అనుమానమేనని పలువురు ఏపీ ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి వెళ్లే బస్సులను ఏదో ఓ సాకుతో ఆపేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 11న ఏపీలో ఓటు వేసేందుకు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా నుంచి లక్షలాది మంది సొంతూర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు 10లక్షల మంది తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వీరిలో దాదాపు 2 నుంచి 3 లక్షల మంది ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని బస్సుల్లో 90శాతం రిజర్వేషన్లు అయిపోయినట్లు సమాచారం. ఏపీలో పోటీ చేస్తున్న అభ్యర్థులు, తమ అనుచరగణంతో జనాలను తరలించేందుకు ప్రైవేటు బస్సులను కూడా ఏర్పాటు చేశారు. కేవలం ఓటు వేయాలనే ఆసక్తితోనే వారంతా ఆంధ్రాకు వెళ్తుండటంతో ఎన్నికల తేదీకి ఒక్క రోజు ముందు వారంతా ఏపీకి బయలుదేరి వెళ్లే అవకాశం ఉంది. అయితే, వారంతా సకాలంలో ఏపీకి వెళ్లి ఓటేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రవాణా శాఖ అధికారులను అడ్డం పెట్టుకుని ఏపీ వెళ్లే ప్రైవేటు బస్సులను అడ్డుకునే అవకాశం ఉందని ఆంధ్రా ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్మిట్‌ లేదని, ఫిట్‌నెస్‌ లేదని, నిబంధనలు పాటించడం లేదని ఇలా ఏదో ఒక సాకుతో బస్సులను మధ్యలోనే ఆపివేసే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. దీంతో వీలైనంత ముందుగానే సొంతూర్లకు చేరుకునేందుకు ఏపీ ఓటర్లు ప్లాన్‌ మార్చుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఇలా వలస ఓటర్లవల్లే వైసీపీ ఓడిపోయిందని ఆ పార్టీ నేతలు తరచూ ప్రస్తావిస్తుంటారు. అందుకే ఈసారి ఏపీ ఓటర్లు సొంతూర్లకు వెళ్లకుండ అడ్డుకునే కుట్రలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.