ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఉగాది రోజు 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని తీర్మానం చేసిన కేబినెట్… ఇళ్ల పట్టాలపై లబ్ధిదారులకు పూర్తి హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. ఇంటి స్థలాలకు వైఎస్ఆర్ జగనన్నగా నామకరణం చేస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం తహశీల్దార్లకు జాయింట్ సబ్ రిజిస్టార్ హోదా ఇవ్వనున్నట్టు వివరించారు.

పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలు ఐదేళ్ల తరువాత విక్రయించుకునేలా అవకాశం కల్పిస్తామని మంత్రి నాని తెలిపారు. ఇళ్ల పట్టాల కోసం 16 వేల ఎకరాల భూమిని బయటివారి నుంచి కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. 2010 ప్రశ్నావళి ఆధారంగానే జనగణన చేయాలని కోరుతూ కేబినెట్‌ తీర్మానం చేసింది. దీని కోసం కేంద్రానికి కేబినెట్ తీర్మానం పంపుతున్నామని మంత్రి నాని వివరించారు. అప్పటివరకు ఏపీలో జనగణన ప్రక్రియను వాయిదా వేస్తున్నామని స్పష్టం చేశారు.

ఒంగోలులో టీడీపీకి కేటాయించిన భూమిని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ భూమిని వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్‌కు తిరిగి అప్పగించాలని నిర్ణయించారు. విజయవాడ, కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్‌లు పూర్తి చేయడానికి రూ. 1000 కోట్లు కేటాయించారు. అమరావతి ప్రాంతంలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్, భూ అక్రమణలపై ఏర్పాటు చేసిన సిట్‌కు ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారం కల్పిస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది.