Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రజల అభ్యున్నతి కోసం తాను అహర్నిశలూ కష్టపడుతోంటే ప్రతిపక్ష నేత మాత్రం తనను కాల్చిచంపాలి…ఉరి తీయాలి అంటున్నారని..బాధ్యతాయుతమైన నేతలు మాట్లాడాల్సిన మాటలు అవేనా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాల ప్రజలను ప్రశ్నించారు. ఉప ఎన్నిక ప్రకటన తర్వాత తొలిసారి ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు పర్యటనకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. ప్రతిపక్ష నేతకు నంద్యాల ప్రజలు ఓటుతో బదులియ్యాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఓటు ప్రజల చేతిలో శక్తిమంతమైన ఆయుధమని, కాల్చనక్కరలేదు, ఉరివేయనక్కరలేదు, ఓటు తోనే ఖతం చేయాలని చంద్రబాబు కోరారు. అత్యధిక మెజార్టీతో భూమా బ్రహ్మానందరెడ్డిని నంద్యాల ప్రజలు గెలిపిస్తారని తనకు నమ్మకముందన్న బాబు ఓటేయాలని లాంఛనంగా ప్రజలను కోరేందుకే వచ్చానని చెప్పారు. ప్రశాంతంగా ఉండే నంద్యాల ఒక చరిత్ర ఉన్న ప్రాంతమని, అభివృద్ధిని ఆకాక్షించే ప్రజలు ఇక్కడ ఉంటారని బాబు ప్రశంసించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో నంద్యాలలో అభివృద్ధి అన్నదే కన్పించలేదని, టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నంద్యాల పురోగతి సాధించిందని ముఖ్యమంత్రి అన్నారు. నియోజకవర్గానికి మూడు నెలల్లో 285 పనులు మంజూరు చేశామని, రూ. 2200కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు.
నంద్యాలను స్మార్ట్ సిటీగా మారుస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రెండున్నరేళ్ల కాలంలో చేపట్టిన ప్రభుత్వ కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ఎనలేని శ్రద్ద కనబరుస్తోందని, సకాలంలో వాటిని పూర్తిచేసి రాయలసీమను సస్యశ్యామలంగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వర్షపునీటిని భూగర్భ జలాలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జలయజ్ఞం ధనయజ్ఞంలా మారిందని విమర్శించిన బాబు , తమ ప్రభుత్వం అనుకున్న గడువులోపే ప్రాజెక్టులు పూర్తిచేస్తోందని తెలిపారు. పట్టిసీమను ఏడాదిలోపు పూర్తిచేయటమే దీనికి ఉదాహరణ అన్నారు.
రైతులకు 24 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని, వ్యవసాయ ఖర్చులు తగ్గించి రైతులు ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డ్వాక్రా సంఘాలను తన మానస పుత్రికలన్న బాబు…ఆడపడుచులకు అడిగడిగి మరీ వంటగ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నామని వివరించారు. రాష్ట్రమే తన కుటుంబమని, పేదలే తన ఆత్మబంధువులని, తనకు అండగా ఉన్న ప్రజలకోసం సర్వస్వం ధారపోస్తానని, చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసమే పనిచేస్తానని చంద్రబాబు ఉద్వేగంగా చెప్పారు.
మరిన్ని వార్తలు: