వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి సాంకేతిక విద్యాపరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరో 20 కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు చేయన్నట్లు జేఎన్‌టీయూ (కాకినాడ) ఉపకులపతి కేవిఎస్‌జీ మురళీకృష్ణ తెలిపారు. ఈ మేరకు కూటమి సర్కార్ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ లారా ఇంజినీరింగ్ కళాశాలకు వచ్చిన ఆయన మాట్లాడుతూ.. ఇతర దేశాల్లో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం చిన్న చిన్న కళాశాలలను యూనివర్సిటీలుగా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోందని చెప్పారు. ఇప్పటికే 3 ఇంజినీరింగ్ కాలేజీలను యూనివర్సిటీలుగా మార్చినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. గతంలో క్రీడల పరంగా 0.5 క్రెడిట్ అందించామని, ఇప్పుడు దాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.