రాష్ట్రంలో దౌర్బాగ్యమైన పరిస్థితి నెలకొందని… మాజీ సీఎం కేసీఆర్‌పై కక్షతో రైతులను బాధపెడుతున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. గోదావరి జలాలు కళ్ళముందే పోతున్నా పట్టించుకునే దిక్కులేదన్నారు. బంకచర్ల ప్రాజక్ట్ 190 టీఎంసీ కోసం చంద్రబాబు కొట్లాడుతున్నారని.. బంకచర్లకు కేంద్రం అనుమతి ఇస్తే మన పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డికి కనీసం ఈ ఏడాది కాలంలో తట్టెడు మట్టి పోయలేదన్నారు. పాలించడం చేతకాక అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. కేసులకు భయపడొద్దని.. ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే ఉందామని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు.