కోడెల మీద దాడి…పోలీసుల అదుపులో నిందితులు !

పోలింగ్ జరిగిన రోజున గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమెట్ల గ్రామంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆయన చొక్కాను కూడా చించేశారు. ఈ ఘటనలో గాయపడ్డ కోడెల స్పృహ కూడా కోల్పోయారు. ఈ నేపధ్యంలో కోడెలపై దాడి చేసింది ఎవరు ? వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దాడి చేసింది ఎవరో గుర్తించేందుకు వీడియో ఫుటేజ్ సహాయం తీసుకుంటున్నారు. ఈరోజు ఇనుమెట్ల గ్రామానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. డోర్ టు డోర్ జల్లెడ పడుతున్నారు పోలీసులు. ఈ దాడిలో మొత్తం ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీనితో అక్కడ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎస్సీ కాలనీలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గ్రామం నుండి ఎవరినీ బయటకు వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గుంపులుగా ఉండడంతో వారిని గుర్తించేందుకు పోలీసులకు కష్టసాధ్యమౌతోందని అంటున్నారు.