ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న ప్రకటనను జగన్ గాలికొదిలేశారని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ విమర్శించారు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్న యువతను వైకాపా ప్రభుత్వం మోసగించిందని శుక్రవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. డీఎస్సీ, గ్రూప్ 2 అభ్యర్థులు జనసేన నాయకులకు అందించిన వినతిపత్రాలను వారు పవన్ దృష్టికి తీసుకువచ్చారు. ఎలాంటి ప్రణాళిక లేకుండా బ్యాంకు ఉద్యోగాలకు పరీక్ష జరిగే రోజే.. గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ అంశాలపై పవన్‌కల్యాణ్ స్పందిస్తూ.. ‘పాదయాత్రలో అనేక హామీలిచ్చిన సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు అన్యాయం చేశారు.
గతంలో 23 వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పి మాట తప్పారు. నిరుద్యోగుల ఆందోళన ఎలా ఉంటుందో జనసేన తరఫున ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాం. తెదేపా, జనసేన ఆధ్వర్యంలో త్వరలో విడుదల చేసే ఉమ్మడి మ్యానిఫెస్టో యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుంది’ అని తెలిపారు.