జిల్లాలో అధికార వైకాపాకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడగా- తాజాగా రాజ్యసభ సభ్యుడు, వైకాపా జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వీడనున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా తరఫున నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆయన గతంలో ప్రకటన చేశారు. అనంతర పరిణామాల్లో పేరుకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారే తప్ప.. ఆయనకు కనీస గౌరవం దక్కలేదని వేమిరెడ్డి అనుచరులు బహిరంగంగా చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే అధిష్ఠానం అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల మార్పు విషయంలో ప్రాధాన్యం ఇవ్వలేదు.
ఇటీవల నెల్లూరు నగర సమన్వయకర్తగా ఎం.డి.ఖలీల్‌ను నియమించిన విషయమై కనీస సమాచారం ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అప్పటి నుంచి వైకాపా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వేమిరెడ్డి.. ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. పార్టీ పెద్దలు ఆయనతో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో బుధవారమో, గురువారమో వైకాపా జిల్లా అధ్యక్ష పదవితో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలిసింది. తదుపరి భవిష్యత్తు రాజకీయ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని అనుచరులు చెబుతున్నారు.