Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రధాని మోడీ కి ఎర్రకోట ఎక్కాక అసలైన సవాల్ ఎదురైంది. నిన్నమొన్నదాకా దేశ రాజకీయాల్లో మాటే శాసనం గా నడిపించిన మోడీకి సొంత రాష్ట్రం నుంచే అనూహ్య ప్రతిఘటన ఎదురు అవుతోంది. ఇక నిర్జీవం అయిపోయిందనుకున్న కాంగ్రెస్ గుజరాత్ లో బీజేపీ కి చుక్కలు చూపిస్తోంది. అధికారం రాగానే రాజకీయ ప్రత్యర్ధులు, మిత్ర పక్షాలు, సొంత పార్టీలో అసమ్మతులు అని తేడా లేకుండా అందర్నీ డదడలాడించిన మోడీ కి ఇప్పుడు గుజరాత్ లో ఓడిపోతే ఏమి జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే గుజరాత్ ఓటరుని నా పరువు కాపాడామనే స్థాయికి వచ్చారు. గుజరాత్ లో కుల సమీకరణాలు కూడా ఈసారి మోడీకి వ్యతిరేకం అయ్యాయి. సుదీర్ఘ కాలం అధికారంలో ఉండటంతో ఇక మోడీ ఏమైనా రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా జనం పట్టించుకునే మూడ్ లో లేరక్కడ. అన్ని వైపులా ఇబ్బందులే ఉన్న ఈ తరుణంలో మోడీకి గుజరాత్ ఎన్నిక నిజమైన పరీక్ష.
ఇక ఇదే గుజరాత్ ఎన్నికలు ఏపీ రాజకీయాల్ని కూడా శాసించబోతున్నాయి. ప్రత్యేక హోదా సహా ప్రధానిగా మోడీ ఏపీ కి ఇచ్చిన ఒక్కో హామీని తుంగలో తొక్కుతున్నా చంద్రబాబు ఎదురు తిరగలేని పరిస్థితి. ఏపీ ప్రజల మనోభావాల దృష్ట్యా కూడా బీజేపీ తో కొనసాగడం మంచిది కాదని బాబుకి బాగా తెలుసు. అయితే కేంద్రంతో సున్నం పెట్టుకుంటే కొత్త రాష్ట్రానికి వచ్చే ఇబ్బందులు అంత కన్నా బాగా తెలుసు. అందుకే ఇంత సంయమనం. అయినా ప్రయోజనం లేదు. ఈ పరిస్థితుల్లో 2019 ఎన్నికలకి పాత కాంబినేషన్ పనిచేయదని తెలిసినా దేశ వ్యాప్త రాజకీయ వాతావరణం చూసాక గానీ ఓ నిర్ణయం తీసుకోలేక ముందుగా గుజరాత్ ఎన్నికల్ని ఆసక్తిగా చూస్తున్నారు చంద్రబాబు. అక్కడ బీజేపీ ఓటమి పాలు అయితే బాబుకి కమలనాధుల్ని వదిలించుకుని జనసేనతో కలవడం తేలిక. అలా గాకుండా బీజేపీ గెలిస్తే మాత్రం బీజేపీ , జనసేన తో ఎటు మొగ్గాలి అన్నది తేల్చుకోవడం అంత సులభం కాదు.