సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 18 ఎకరాల స్మృతివనంలో రూ.404.35 కోట్లు ఖర్చుతో తయారు చేయబడిన 206 అడుగులున్న అంబేడ్కర్ మహాశిల్పాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అంబేడ్కర్ విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా.. 81 అడుగుల ఎత్తు గల పీఠాన్ని బౌద్ధ మత కాలచక్ర మహామండపం తరహాలో తీర్చిదిద్దారు. అంతేకాకుండా అంబేద్కర్ జీవిత విశేషాలతో కూడిన ప్రత్యేక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. పోరాటానికి రూపమే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని, సామాజిక న్యాయ మహాశిల్పం పేరిట అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ప్రపంచంలోని ఇతర అంబేద్కర్ విగ్రహాలన్నింటి కంటే పెద్దది అని,అందరినీ ఒక్కతాటిపై తీసుకురావడానికి అంబేద్కరే స్ఫూర్తి అని పేర్కొన్నారు. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కు ఇకపై విజయవాడ చిరునామాగా మారుతుందని సీఎం జగన్ తెలిపారు.దళిత, బలహీన వర్గాలపై చంద్రబాబు నాయుడు కి ప్రేమ లేదని అన్నారు.