‘నరసరావుపేట సీటు కావాలంటే వైకాపాలో నా విధేయత నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపక్షాన్ని తిట్టాలని ఎమ్మెల్యేల ద్వారా సీఎం జగన్ చెప్పించారు. ఇది నాకు నచ్చలేదు. అందుకే బయటకు వచ్చేశా’ అంటూ ఎం పీ శ్రీకృష్ణదేవరాయలు ఇటీవల నరసరావుపేటలో జరిగిన సమావేశంలో చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. గుంటూరు వెళ్లాలని, అక్కడ ఓడిపోతే రాజ్యసభకు పంపుతానని సీఎం చెప్పారని, అయితే తాను వెళ్లనని అప్పుడే చెప్పేశానని తెలిపారు.
ఇంకో సందర్భంలో పల్నాడు వైకాపా ఎమ్మెల్యేలంతా సీఎం జగన్ను కలవడానికి వెళ్లినప్పుడు.. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపక్షాన్ని తిట్టాలని, విధేయతను నిరూపించుకోవాలని వారికి ముఖ్యమంత్రి చెప్పారని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యేలు బయటకు వచ్చి తనతో అన్నప్పుడు ఆ అవసరం లేదని, తన దారిలోకి రావొద్దని సూటిగా చెప్పానని వెల్లడించారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు నా విధేయత నిరూపించుకోవాల్సిన అవసరం లేదని చెప్పినట్లు తెలిపారు.