వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శివారు సర్వే సంఖ్య 2049లోని ప్రభుత్వ భూమిలో భూఆక్రమణలు నిజమేనని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. వైకాపాలోని కీలక నేత అనుచరులు నకిలీ భూహక్కు పత్రాలు సృష్టించి సెంటు రూ.లక్ష వంతున విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ భూదందాపై ‘కన్ను పడితే కైవసమే’ శీర్షికన ‘ఈనాడు’ సంచికలో మంగళవారం కథనం ప్రచురితమైంది. దీనిపై రాష్ట్ర ఉన్న తాధికారులు స్పందించి వాస్తవ నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. కడప ఆర్డీవో జి.ఆర్.మధుసూదన్ ఆక్రమిత స్థలాలను పరిశీలించారు. అక్రమ కట్టడాలను చూసి రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణదారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. మొత్తం 1.60 ఎకరాలు పరాధీనమైనట్లు తేల్చారు.
రెవెన్యూ రికార్డులను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆర్డీవో తెలిపారు. వాటిని పూర్తిగా తొలగించాలని తహసీల్దారు మాధవీలత, ఆర్ఐ వెంకటరమణను ఆదేశించడంతో కొన్ని నిర్మాణాల పునాదులను తొలగించారు. కొందరు తమ వద్ద భూహక్కు పత్రాలు ఉన్నాయని తీసుసుకురాగా.. అధికారులు వాటిని దొంగ పట్టాలుగా తేల్చారు. ఆర్ఐలు సునీత, లిఖిత, శ్రీనివాసులు పాల్గొన్నారు.