తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ‘నిజం గెలవాలి’ యాత్ర చేపట్టనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్తో మనస్తాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. ఈనెల 3న విజయనగరం, 4న పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, 5న విశాఖపట్నం జిల్లాల్లో భువనేశ్వరి పర్యటిస్తారని ఆ పార్టీ నాయకులు మంగళవారం వెల్లడించారు. బుధవారం ఉదయం విజయనగరంలోని 23వ వార్డుకు చెందిన అప్పారావు(అలియాస్ పాల అప్పా రావు) కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం బొబ్బిలి చేరుకుంటారు. అక్కడి నుంచి తెర్లాం మండలం పెరుమాళిలో మైలపల్లి పోలయ్య, మోదుగులవలస గ్రామంలో గులిపల్లి అప్పారావు కుటుంబాలను ఓదారుస్తారు.
రాత్రికి రాజాం చేరుకుని జీఎం ఆర్ అతిథిగృహంలో బస చేస్తారు. మరుసటి రోజు భామిని మండలం బిల్లమడలో బర్రి విశ్వనాథం కుటుంబాన్ని పరామర్శించి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్తారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున ఆర్థిక సాయం అందజేయనున్నారు. తొలుత ఈ యాత్రను శ్రీకాకుళం జిల్లాలో శాసన సభాపతి తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమదాలవలస నుంచి గతేడాది అక్టోబరులోనే చేపట్టాలని నిర్ణయించారు. విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జిల్లా సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన అనంతరం ఆమదాలవలసకు చేరుకోవాలనుకున్నారు. రాజమహేంద్రవరం నుంచి బయలుదేరిన తర్వాత చంద్రబాబుకు రాష్ట్ర హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం తెలిసింది. ఈ క్రమంలో విజయనగరం ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రులకు ధైర్యం చెప్పిన ఆమె రాజమహేంద్రవరం వెళ్లిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి యాత్రకు శ్రీకారం చుట్టారు.
ఘన స్వాగతానికి ఏర్పాట్లు
భువనేశ్వరికి ఘన స్వాగతం పలికేందుకు ఆ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగరం శివారులోని చెల్లూరు వద్ద నుంచి భారీ ర్యాలీ చేపట్టనున్నారు. భోగాపురం మండలం పోలిపల్లిలో జరిగిన ‘యువగళం – నవశకం ’ విజయోత్సవ సభతో జోష్లో ఉన్న పార్టీ శ్రేణులకు భువనేశ్వరి పర్యటన మరింత నూతనోత్సాహం నింపుతుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.