నాలుగున్న రేళ్లలో క్రీడాకారులను ఆటలో అరటి పండుగానే చూసిన జగన్ ఎన్నికల ముందు మట్టిలో మాణిక్యాలను తీసుకొస్తానని ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో ఆరంభ శూరత్వమే చూపారు. ముగింపు వేడుకలకు విశాఖ వచ్చిన జగన్ జనాలతో ఓ ఆట ఆడుకున్నారు. ఆర్టీసీ బస్సులన్నీ తన సభ కోసం తరలించుకుని ప్రయాణికులను అవస్థలకు గురి చేశారు. నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారిపై ఒక పూటంతా ట్రాఫిక్ నిలిచి నగర వాసులకు నరకం చూపించారు. సీఎం జగన్ మంగళవారం సాయంత్రం వస్తున్నారనే సమాచారంతో… ఉదయం నుంచే బస్సు సర్వీసులను నిలిపేశారు.
వందల సంఖ్యలో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగర పరిధిలో సిటీ సర్వీసులు తగ్గిపోవడంతో ఆటోల్లోనే నగరవాసులు రాకపోకలు సాగించారు. పీఎం పాలెం స్టేడియం సమీపంలో జాతీయ రహదారిపై రెండువైపులా సుమారు 4గంటలు ట్రాఫిక్ నిలిచిపోయింది. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9గంటల వరకు ట్రాఫిక్ కష్టాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ ట్రాఫిక్లో అంబులెన్స్ చిక్కుకుపోయినా పోలీసులు ఆ వాహనానికి దారి చూపించే ప్రయత్నం చేయలేదు. జగన్ సాయంత్రం 5 గంటల సమయంలో ఐటీ హిల్స్ వద్ద హెలిప్యాడ్కు చేరుకున్నారు. ఆ సమయంలో ఐటీ సంస్థల నుంచి విధుల ముగించుకుని ఇళ్లకు వెళ్లాల్సిన ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు.