కాసేపు ఆగండమ్మా .. మంత్రులు ఇంకా మాట్లాడలేదు. వారి ప్రసంగాలు ముగిసేవరకైనా ఉండండమ్మా ’.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురంలో శుక్రవారం వైకాపా సామాజిక సాధికార బస్సుయాత్రలో కనిపించిన పరిస్థితి ఇది. సభకు తీసుకువచ్చిన డ్వాక్రా మహిళలను వీవోఏలు పదేపదే విజ్ఞప్తి చేసినా ఈ ప్రసంగాలు తాము వినలేమంటూ వెళ్లిపోయారు. గ్రామాలనుంచి ఆటోల్లో డ్వాక్రా మహిళలను ఒత్తిడి చేసి మరీ వీవోఏలు తీసుకువచ్చారు.
మంత్రులు పినిపే విశ్వరూప్, వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీలు కుడిపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్న ఈ సభకు స్థానిక శాసనసభ్యుడు రాపాక వరప్రసాదరావు అధ్యక్షత వహించారు. మధ్యాహ్నం 3.15 గంటలకు ఎమ్మెల్యే ప్రారంభోపన్యాసం ముగియగానే జనం వెళ్లిపోవటం మొదలుపెట్టారు. మంత్రుల ప్రసంగాలు ఉండటంతో వీవోఏలు, దిగువస్థాయి అధికారులు ఉలిక్కి పడి వెళ్లిపోతున్న మహిళలను బతిమిలాడినప్పటికీ నిష్ఫలమే అయింది.