జేఈఈ మెయిన్ తొలి విడత పేపర్-1లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 23 మంది 100 పర్సం టైల్ సాధించగా, వారిలో 10 మంది ఏపీ, తెలంగాణకు చెందిన వారే కావడం విశేషం . పేపర్-1 పర్సంటైల్ ను జాతీయ పరీక్షల సంస్థ మంగళవారం ఉదయం వెల్లడించింది. ఎన్ఐటీల్లో బీటెక్‌లో ప్రవేశాలకు, జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత కోసం జేఈఈ మెయిన్ పేపర్-1ను జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 11.70 లక్షల మంది పరీక్షలు రాయగా, తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 2.40 లక్షల మంది హాజరయ్యారు. 100 పర్సంటైల్ దక్కించుకున్న వారిలో తెలంగాణ విద్యార్థులు ఏడుగురు ఉండగా, ఏపీ నుంచి ముగ్గురు ఉన్నారు. వీరిలో జనవరి 27న ఉదయం పరీక్ష రాసినవారే ఎక్కువ మంది ఉన్నారని నిపుణులు చెబుతున్నారు. ఆ రోజు ఉదయం విడత పరీక్ష సులభంగా ఉండటమే ఇందుకు కారణమని జేఈఈ నిపుణుడు ఎం .ఉమాశంకర్ అభిప్రాయపడ్డారు.
ఈసారి కూడా జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు జనరల్ విభాగం విద్యార్థులకు కటాఫ్ 90 పర్సంటైల్ వరకు ఉండొచ్చని ఆయన అంచనా. ఏప్రిల్‌లో జరిగే చివరి విడత జేఈఈ మెయిన్ తర్వాత రెండింటిలో వచ్చే ఉత్తమ పర్సంటైల్‌ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు కేటాయిస్తారు.