ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.12 లక్షల కోట్లు అప్పు చేసిందని, ఇకపై కొత్తగా అప్పులు పుట్టే అవకాశం కూడా లేదని ఇటీవల తెదేపాలో చేరిన ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య అన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం మారి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా, ఆయనకు సీఎం పదవి ముళ్లకిరీటమేనని అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ తన స్వలాభం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రాజెక్టులపై ప్రశ్నించకుండా రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేశారని మండిపడ్డారు. కడపలోని తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సి.రామచంద్రయ్య మాట్లాడారు. ‘వైకాపాలో ప్రజాస్వామ్య విలువల్లేక బయటకు వచ్చాను. సీఎం జగన్తో ఎక్కువగా మాట్లాడలేకపోయాను. కొంతమంది సలహాదారులు వాస్తవాలను, ప్రజా అభిప్రాయాలను నిక్కచ్చిగా ఆయనకు చెబితే బాగుంటుంది.
రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు రక్షణ కరవైంది. వాటిని కాపాడటం లో పాలకులు విఫలమయ్యారు. నాపై పలువురు కావాలనే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. అందుకే ఎమ్మెల్సీగా మరో మూడేళ్ల పదవీకాలం ఉన్నా త్వరలోనే రాజీనామా చేస్తున్నా . రాజంపేట అసెంబ్లీ టికెట్ తన కుమారుడికి ఇప్పించుకునేందుకే పార్టీ మారినట్లు వస్తున్న ప్రచారాల్లో వాస్తవం లేదు. తెదేపా, జనసేన సంయుక్త పాలనలో రాష్ట్రానికి మేలు జరుగుతుందని భావించి తెదేపాలో చేరాను’ అని సి.రామచంద్రయ్య వెల్లడించారు. సమావేశంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ పాల్గొన్నారు.