Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సాధారణంగా తిరుమల శ్రీవారి స్వామి దర్శనం అంటే గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిందే. ముఖ్యంగా వేసవిలో అయితే ఈ పరిస్థితి మరింత వర్ణనాతీతం. కేవలం దర్శన భాగ్యమే కాదు.. చివరకు గదులు కూడా దొరకడం గగనమే. దీనిని దృష్టిలో పెట్టుకుని విశాఖ నుంచి తిరుమలకు వెళ్లే యాత్రికుల కోసం ఏపీటీడీసీ ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయనున్నది. రద్దీతో పనిలేకుండా గంట నుంచి గంటన్నర వ్యవధిలోనే వేంకటేశ్వరుని దర్శనం చేయించే సదుపాయం కల్పించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్థి సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో తిరుమలలో దర్శనానికి అనువుగా ఏర్పాట్లు చేస్తోంది. చాలాకాలం కిందటే రూపొందించిన ప్రతిపాదనలు ఈ నెలాఖరులోగా అమలులోకి తీసుకురానున్నారు. ఏపీటీడీసీ ప్రతిపాదనల మేరకు బెంగళూరులో వొల్వో బస్సులు సిద్ధం చేశారు. బస్లు నడిపేందుకు బెంగళూరులో నిర్వహిస్తున్న శిక్షణకు విశాఖ, తిరుపతి నుంచి ఇద్దరేసి డ్రైవర్లను పంపించారు.
ఏపీటీడీసీ సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో తిరుమలలో దర్శనానికి అనువుగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ బస్సుల్లో తిరుమలకు వెళితే రద్దీతో పనిలేకుండా గంట నుంచి గంటన్నర వ్యవధిలోనే వేంకటేశ్వరుని దర్శనం చేయించే సదుపాయం కల్పించనుంది. విశాఖ నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటలకు వొల్వో బస్సు బయలుదేరి మరుసటి రోజు తిరుపతికి చేరుకుంటుంది. మొత్తం 43 సీట్లు ఇందులో ఉంటాయి. ప్రయాణికులకు తిరుపతిలో వసతి కల్పిస్తారు. తిరుపతి నుంచి తిరుమలకు ఆర్టీసీ బస్సులో తీసుకెళ్లి వేగంగా దర్శనం కల్పించి వెనక్కు తీసుకువస్తారు. అదే రోజు మధ్యాహ్నం తిరుపతిలో బయలుదేరి శ్రీకాళహస్తిలో దర్శనం కల్పిస్తారు. ఆ మరుసటి రోజు ఉదయం విశాఖకు బస్ చేరుకుంటుంది. మూడురోజుల టూర్కు సంబంధించి ఒకరికి నాలుగువేల రూపాయలతో ప్యాకేజీ రూపొందించారు. అయితే, ఈ ప్యాకేజీ వివరాలకు సంబంధించి ఏపీటీడీసీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.