Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆఫ్రికా దేశం జింబాబ్వేలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. 1980 నుంచి దేశాధ్యక్షుడిగా ఉన్న 93 ఏళ్ల రాబర్ట్ ముగాబేపై ఆర్మీ తిరుగుబాటు చేసిందన్న వార్తలు ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. అయితే ఈ వార్తలను జింబాబ్వే సైన్యం తోసిపుచ్చింది. తాము అధ్యక్షుడిపై సైనిక చర్యకు ప్రయత్నించలేదని, ముగాబే చుట్టూ ఉన్న క్రిమినల్స్ ను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ చేపట్టామని అధికారిక మీడియాలో వెల్లడించింది. ముగాబే, ఆయన కుటుంబం క్షేమంగా ఉందని, వారి రక్షణకు తాము హామీ ఇస్తున్నామని, ఆర్మీ జనరల్ తెలిపారు. అధ్యక్షుడి వెంట ఉంటూ నేరాలకు పాల్పడుతున్న క్రిమినల్స్ ను టార్గెట్ చేసుకున్నామని, తమ లక్ష్యం పూర్తికాగానే పరిస్థితి సాధారణస్థితికి వస్తుందని చెప్పారు.
ముగాబే ప్రైవేట్ నివాసాన్ని భారీగా సైనిక వాహనాలు చుట్టుముట్టాయని, ఆ ప్రాంతంలో కాల్పులు కూడా జరిగాయని మంగళవారం వార్తలొచ్చాయి. ముగాబేకు , ఆర్మీ చీఫ్ జనరల్ కాన్సాంటినో చివెంగాకు మధ్య ఇటీవల విభేదాలు బాగా పెరిగిపోయాయి. వయసు మీదపడడం, ఆరోగ్య స్థితి సరిగ్గా లేకపోవడంతో ..ముగాబే మళ్లీ అధ్యక్షుడు కావడం ఆర్మీ చీఫ్ కు ఇష్టం లేదన్న వాదన దేశంలో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో జింబాబ్వే తదుపరి అధ్యక్షుడు కావడానికి ప్రయత్నిస్తున్న ఉపాధ్యక్షుడు ఎమ్మర్సన్ ను అధికార పార్టీ నుంచి ముగాబే డిస్మిస్ చేయడాన్ని ఆర్మీ చీఫ్ తప్పుబట్టారు. పార్టీలోని సీనియర్లను బలవంతంగా తొలగించడాన్ని మానుకోవాలని ముగాబేను ఆయన డిమాండ్ చేశారు. దీంతో అధికార జాను పీఎఫ్ పార్టీ ఆర్మీ చీఫ్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. ముగాబేకు వ్యతిరేకంగా ఆర్మీ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించింది. ఇది జరిగిన మరుసటి రోజే అధ్యక్షుడి నివాసంవైపు ఆర్మీ దూసుకురావడంతో తిరుగుబాటు వార్తలొచ్చాయి. జింబాబ్వే 1980లో బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందింది. అప్పటినుంచి ముగాబేనే దేశాధ్యక్షుడిగా ఉన్నారు.