ఎన్నికల సమయంలో మొదలైన టీడీపీ, వైసీపీ మధ్య పరస్పర దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుపాడులో రోడ్డుకు అడ్డంగా గోడకట్టిన ఘటనపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. పొనుగుపాడు ఘటనపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీని శనివారం పంపుతున్నట్టు ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో పొనుగుపాడు వ్యవహారంపై నిజనిర్ధారణకు వెళ్లిన టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్యేలు మద్దాల గిరిధర్ రెడ్డి, జీవీ ఆంజనేయులు, శ్రావణ్‌కుమార్‌లను అరెస్టు చేసి నరసారావుపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఎన్నికల తర్వాత పొనుగుపాడులో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ వర్గీయులు రోడ్డుకు అడ్డంగా గోడకట్టారు. దీంతో టీడీపీ నేతలు తమ ఇళ్లకు వెళ్లే అవకాశం లేకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది.
ఇదే అంశాన్ని చంద్రబాబు అసెంబ్లీలోనూ ప్రస్తావించారు. పొనుగుపాడులో పర్యటించేందుకు వచ్చిన టీడీపీ నేతలను శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందంటూ గ్రామం బయటే వారిని ముందస్తుగా అరెస్టు చేశారు. ఎలాంటి ఆందోళనలు చేపట్టబోమని వారు పేర్కొన్నా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.