అమెరికా అంతటా హాట్ టాపిక్ గా నిలిచిన మేరీల్యాండ్‌లో సిక్స్త్ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎన్నికలలో బరిలోకి దిగి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన తెలుగమ్మాయి కాట్రగడ్డ అరుణా మిల్లర్ అనూహ్యంగా ఓటమి పాలు అయ్యారు. ఆమె గెలుపు నల్లేరు పై నడకేనని అందరూ భావించారు. అయితే అందరి అంచనాలని తలకిందులు చేస్తూ ఆమె ఓటమి పాలయ్యారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థి, అపర కుబేరుడు అయిన డేవిడ్ ట్రోన్ చేతిలో 5,544 ఓట్ల తేడాతో అరుణ ఓటమి పాలయ్యారు. బరిలో మొత్తం 8 మంది అభ్యర్థులుండగా మిల్లర్ 17,311 ఓట్లతో రెండో స్థానంలో నిలవడం కొసమెరుపు.
ఈ ఎన్నికల్లో ట్రోన్ విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టడమే ఆయన విజయానికి కారణమని తెలుస్తోంది. 2016 ఎన్నికల్లో ఓటమి పాలైన ట్రోన్ ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని తొలి నుంచీ పట్టుదలగా ఉన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ఏకంగా రూ.65 కోట్లు ఖర్చు చేశారు. తాను ప్రచారంలో డబ్బులు పంచలేదని పేర్కొన్న మిల్లర్ ఖర్చు చేసింది కేవలం రూ.16 కోట్లే. బరిలో 8 మంది అభ్యర్థులుండడం ఆమెకు ప్రతికూలంగా మారింది. వారిలో ఇద్దరు విడివిడిగా 5,500 ఓట్ల పైనే సాధించారు. మరో ముగ్గురికి వెయ్యి లోపే ఓట్లు వచ్చాయి. ఎక్కువ మంది అభ్యర్థులుండడంతో పాటు ట్రోన్ విపరీతంగా డబ్బు వెదజల్లడం కూడా అరుణ ఓటమికి కారణంగా తెలుస్తోంది.