ఆర్యన్‌ ఖాన్‌కు మళ్లీ కోర్టులో చుక్కెదురు

ఆర్యన్‌ ఖాన్‌కు మళ్లీ కోర్టులో చుక్కెదురు

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు మళ్లీ కోర్టులో చుక్కెదురైంది. తాజాగా ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌ను విచారించిన ముంబై కోర్టు మరోసారి అతడికి బెయిల్‌ నిరాకరిస్తూ తీర్పునిచ్చింది. కాగా గత 14 రోజులుగా ఆర్యన్‌ ఆర్థర్‌రోడ్‌ జైలులోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఆర్యన్‌ బెయిల్‌ను ముంబై కోర్టు తిరస్కరించడం ఇది మూడవ సారి. దీంతో షారుక్‌, అతని భార్య గౌరీ ఖాన్‌ ఆందోళన చెందుతున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం.

కాగా గత ముందు బెయిల్ దరఖాస్తులలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రత్యుత్తరాలను దాఖలు చేస్తుందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అద్వైత్ సేథ్నా జూనియర్ కోర్టుకు తెలియజేశారు. దీంతో బుధవారం ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై ప్రత్యేక ఎన్‌డిపిఎస్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ దొరకలేదు. ఆర్యన్ బెయిల్‌ను కోర్టు నిరాకరించింది. విచారణకు ముందు ఆర్యన్‌కు నేడు బెయిల్ దొరకడం ఖాయమని ముంబై సెషన్స్ కోర్టులో సీనియర్ న్యాయవాది మజీద్ మెమన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ముంబై తీరంలో క్రూయిజ్‌ షిప్‌పై దాడి చేసిన పోలీసులు ఆర్యన్‌తో పాటు మరికొందరిని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 8 నుంచి ఆర్యన్ ముంబైలోని ఆర్థర్రోడ్ జైల్లో ఉన్నాడు. ఆర్యన్ వద్ద డ్రగ్స్ దొరకలేదని ఆయన తరపు న్యాయవాదులు చేసిన వాదనను కోర్టు పట్టించుకోలేదు. మరోవైపు ఓ వర్ధమాన నటితో ఆర్యన్ వాట్సాప్ లో డ్రగ్స్ గురించి చేసిన సంభాషణను కోర్టుకు ఎన్సీబీ అందించింది. మరోవైపు ఆర్యన్ స్నేహితులు అర్భాజ్ మర్చంట్, మున్ మున్ ధమేచా పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను కూడా కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆర్యన్ తరపు లాయర్లు ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.