ఇలా అయినా ఆర్యన్‌ సెటిల్‌ అయ్యేనా…?

Actor Aryan Rajesh Is Happy To Make A Comeback With Vineya Vidheya Rama

ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ పెద్ద కొడుకు అయిన ఆర్యన్‌ రాజేష్‌ హీరోగా పరిచయం అయ్యాడు. తండ్రి ప్రోత్సాహంతో రెండు మూడు సినిమాలు చేసిన ఆర్యన్‌ రాజేష్‌ పెద్దగా సక్సెస్‌ను దక్కించుకోలేక పోయాడు. అదే సమయంలో అల్లరి నరేష్‌ హీరోగా పరిచయం అయ్యి, సక్సెస్‌ అవ్వడంతో ఆర్యన్‌ రాజేష్‌ కనుమరుగయ్యాడు. ఆర్యన్‌ రాజేష్‌ చాలా కాలం తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు తెలుగు సినీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దం అయ్యాడు. రామ్‌ చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో విలన్‌ పాత్రను పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. హీరోగా చేసిన వారు ఎంతో మంది విలన్‌ వేశాలు వేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడు రామ్‌ చరణ్‌ సినిమాలో ఆర్యన్‌ రాజేష్‌ కూడా అదే పని చేస్తున్నాడు.

రామ్‌ చరణ్‌, బోయపాటి మూవీలో బాలీవుడ్‌ స్టార్‌ విలన్‌గా నటిస్తున్నాడు. మరో విలన్‌గా ఆర్యన్‌ రాజేష్‌ కనిపించబోతున్నాడు. విలన్‌గా ఈ చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకుంటే సినీ కెరీర్‌ను కంటిన్యూ చేసే అవకాశం ఉంది. విలన్‌ పాత్రతో పాటు, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా ఆర్యన్‌ నటించేందుకు ఆసక్తిని కనబర్చుతున్నాడు. ఇకపై హీరోగా ప్రయత్నాలు చేయకుండా కేవలం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మరియు విలన్‌ పాత్రలను చేసేందుకు ఆర్యన్‌ ఆసక్తి చూపుతున్నట్లుగా సమాచారం అందుతుంది. మరో వైపు అల్లరి నరేష్‌ హీరోగా నటిస్తూనే మొదటి సారి మహేష్‌బాబు 25వ మూవీలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ రెండు చిత్రాలు ఈ అన్నదమ్ముళ్లకు ఏ స్థాయిలో సక్సెస్‌ను అందిస్తాయో చూడాలి.