Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ చీకటి జీవితం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో దేశంలో గొప్ప వ్యక్తులుగా చలామణి అవుతున్న అనేకమంది బాబాలపై ప్రజల్లో సందేహాలు కలుగుతున్నాయి. దైవసమానులుగా పూజలందుకుంటున్న బాబాలు నిజంగా దానికి అర్హులేనా అన్న చర్చ కూడా మొదలయింది. ఈ తరుణంలో రానున్న ప్రమాదాన్ని పసిగట్టి అఖిల భారత అక్షర పరిషద్ దేశంలోని నకిలీ బాబాలతో ఓ జాబితా రూపొందించి విడుదలచేసింది. ఈ లిస్టులో ఉన్న బాబాలు మాత్రమే గుణవంతులైన వారు కాదని..మిగిలిన వారంతా చాలా మంచి బాబాలని అక్షర పరిషద్ తెలియజేసింది. అయితే దాదాపు ఎనిమిదేళ్ల క్రితమే నటి రంజితతో రాసలీలలు సాగిస్తూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన నిత్యానంద స్వామి పేరు మాత్రం నకిలీ బాబాల జాబితాలో లేకపోవటం దేశ ప్రజల్ని ఆశ్చర్యపరచడంతో పాటు ఆ జాబితాపై అనుమానాలు కలిగించింది.
ఈ విషయాన్ని పక్కనపెడితే..జాబితా విడుదలైన తర్వాత అందులో పేరున్న ఆశారాం బాపు తొలిసారి మీడియాకు కనిపించారు. అత్యాచారం కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న ఆశారాం బాపూను విచారణ నిమిత్తం న్యాయస్థానానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో విలేకరులు పరిషత్ ఆరోపణల ప్రకారం మీరు సాధువు కాదు, గురువు కాదు, మరి ఏ కేటగిరీకి చెందుతారు అని ప్రశ్నించారు. దీనిపై చిరాకు పడిన ఆశారాం నేను గాడిదల కేటగిరీకి చెందిన వాడిని అని చెప్పి వెళ్లిపోయారు. పరిషత్ జాబితాలో ఆశారాంతో పాటు ఆయన కుమారుడు నారాయణ్ సాయి కూడా ఉన్నాడు. మొత్తానికి గుర్మీత్ పుణ్యమా అని బాబాలను ప్రజలు గుడ్డిగా నమ్మే రోజులు పోయాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. డేరా బాబా, ఆశారాం బాపూ ల్లా నకిలీ బాబాలంతా జైలు ఊచలు లెక్కబెట్టేరోజులు వస్తాయని అంటున్నారు.