కరోనా పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు నిచ్చిన జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన అశ్విన్.. తన ట్విట్టర్ ఖాతా పేరును లెట్ స్టే ఇండోర్స్ ఇండియాగా కూడా మార్చుకున్నారు. ఇక తొలిరోజు బుద్ధిగా కర్ఫ్యూను పాటించిన ప్రజలు ఆ తర్వాత నిర్లక్ష్యంగా రోడ్లపైకి రావడం మొదలు పెట్టారు. దీంతో ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని లేకుంటే జరిగే అనర్థాలు ఎలా ఉంటాయో సింపుల్ గా సుత్తి లేకుండా చెప్తూ అశ్విన్ తనదైన స్టైల్ లో ట్వీట్ చేశారు. దీంతో అశ్విన్ తాజాగా చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. క్రికెట్ లోనే వివాదాస్పద నిబంధన అయిన… మన్కడింగ్ ఔట్ తో ప్రస్తుత పరిస్థితిని పోల్చుతూ ప్రజలను ఇంట్లోనే ఉండాలని హెచ్చరించారు అశ్విన్. ఇంట్లోనే ఉండండి లేకుంటే మన్కడింగ్ అవుటే అవుతారంటూ సూచించారు. బంతి వేయకుండానే క్రీజు దాటిన బ్యాట్స్ మెన్ ల బయటకు వెళ్లి కరోనాను అంటించుకోవటం అవసరమా? అనే తన ఉద్దేశాన్ని ఈ ట్వీట్ లో తెలియజేశారు. అయితే ఎవరో ఈ ఫోటోను నాకు పంపారని.. ఈ రనౌట్ జరిగి సరిగ్గా ఏడాది అయిందని గుర్తు చేశారు అశ్విన్.
అదేవిధంగా దేశం లాక్ డౌన్ లో ఉన్నప్పుడు దీన్ని గుర్తు చేయడం బాగుందని.. బయటకు రాకండి అవుట్ అవ్వకండి ఇంట్లోనే సురక్షితంగా ఉండండి అంటూ మాన్కడింగ్ కు సంబంధించిన ఫోటోకు హ్యాష్ టాక్ 21డే లాక్ డౌన్ ను జత చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇక గతేడాది ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్ మెన్ జోస్ బట్లర్ ను అప్పుడు పంజాబ్ కెప్టెన్ గా ఉన్న అశ్విన్ మన్కడింగ్ ద్వారా అవుట్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో… ఇది పెద్ద దుమారాన్నే రేపింది. క్రీడాస్పూర్తికి విరుద్దంగా.. అశ్విన్ వ్యవహరించాడని కొందరు విమర్శించగా అతను నిబంధనల ప్రకారమే వ్యవహరించాడని మరికొందరు మద్దతు పలికారు. అప్పట్లో దీనిపై తీవ్ర చర్చ జరిగింది. దీంతో మన్కడింగ్ అనగానే అశ్విన్.. అశ్విన్ అనగానే మన్కడింగ్ అనే విషయం అభిమానులకు గుర్తుండిపోయింది.