ఎట్టకేలకి రైలోచ్చింది

atlast train has came

హైదరాబాద్ నగర్ శివారులోని పటాన్ చెరు వాసులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఎంఎంటీఎస్‌ రైలు రానే వచ్చింది. నిత్యం లక్షల్లో ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు సోమవారం పట్టాలపై పరుగుపెట్టింది. రామచంద్రాపురం, పటాన్‌చెరు, అమీన్‌పూర్‌ తదితర ప్రాంతాల్లోని పరిశ్రమల్లో విధులకు సమయానికి రాలేక ట్రాఫిక్‌లో నానా ఇబ్బందులు పడుతున్న వారికి ఎంఎంటీఎస్‌ రాకతో ఉపశమనం లభించినట్టయింది. సమయం ఆదాతోపాటు దారి ఖర్చులు తగ్గుతాయి. ప్రయాణికుల సౌకర్యార్థం జాతీయ రహదారి దగ్గరలో రామచంద్రాపురం రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి 11 గంటల 15 నిమిషాలకు ఫలక్ నుమా నుండి రామచంద్రపురం స్టేషన్ కు చేరుకున్న రైలు, తిరిగి ఈరోజు ఉదయం 5 గంటల 5 నిమిషాలకు రామచంద్రపురం నుండి బయలుదేరి బిహెచ్ఇఎల్ తెల్లాపూర్ స్టేషన్ల మీదుగా లింగంపల్లి వయ హైదరాబాద్ కి చేరనుంది. అలానే రెండో రైలు (రామచంద్రాపురం- ఫలక్‌నామా) ఉదయం 6.10 గంటలకు బయలుదేరి ఫలక్‌నామాకు 7.55 గంటలకు చేరుతుంది. గతంలోనే తెల్లాపూర్‌ మీదుగా రామచంద్రాపురం పట్టణం వరకు ఎంఎంటీఎస్‌ రైలును పొడిగించారు. పనులు పూర్తయి సుమారు రెండేళ్లు పూర్తి అవుతున్నా రైలు మాత్రం రాలేదు. 6 నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్‌ రెడ్డి త్వరలో ఎంఎంటీఎస్‌ రైలును రప్పించేందుకు కృషి చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చి గెలుపొందాక ఈ విషయంపై రైల్వే ఉన్నతాధికారులను సైతం సంప్రదించారు. ఈ క్రమంలో ఎన్నో ఏళ్లుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ఎంఎంటీఎస్ రైలు సౌకర్యం ఎట్టకేలకు సోమవారం ప్రారంభం అయింది.