ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల ప్రక్రియ

election process completed peacefully

★ పల్లెల్లో స్వయంపాలన

★ కొత్త జిల్లాలు, మండలాల్లో కొలువైన పాలక మండళ్లు

★ స్వయంసమృద్ధి దిశగా పంచాయతీలు

★ గ్రామాల అభివృద్ధిలో పరిషత్ సభ్యులకు ప్రత్యేకాధికారాలు

★ ఇక మున్సిపాల్టీ ఎన్నికలకు కసరత్తు

స్థానిక సంస్థల్లో అత్యంత ప్రధానమైన ఎన్నికల ప్రక్రియ ముగిసింది. జనవరిలో గ్రామ పంచాయతీల ఎన్నికలతో ప్రారంభమైన స్థానికఎన్నికలు మేలో జరిగిన జిల్లా, మండల పరిషత్ ఎన్నికలతో సింహభాగం పూర్తయినట్లయింది. మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగాల్సి ఉన్నది. రిజర్వేష న్ల జాబితా అందితే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి పేర్కొన్నారు.

కొత్త గ్రామాలు.. కొత్త జిల్లాలు..
—————————————
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనాసంస్కరణలు తీసుకురావడంతో కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయి. గ్రామీణాభివృద్ధి పరిపుష్టం చేయడంకోసం ప్రభుత్వం గత ఫిబ్రవరి నుంచి నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. సుమారు 12,751 గ్రామాలకు పాలక మండళ్ల ఎన్నికతోపాటు 32 జిల్లాలు, 538 మండలాల పరిషత్‌లకు ఎన్నికలయ్యాయి. తండాలు, గూడేలు కొత్తగా గ్రామాలు కావడంతో వేలమంది గిరిజనులకు రాజకీయ అధికారం లభించింది. నూటికి నూరుశాతం గిరిజన పాలక మండళ్లు ఏర్పడటం రాష్ట్ర చరిత్రలోనే రికార్డు. చాలా గ్రామాలు, మండలాలు, జిల్లా పరిషత్‌లు నూతనంగా ఏర్పడటంతో వాటికి ఎన్నికైన ప్రతినిధులు తొలి సర్పంచ్‌లుగా, ఎంపీపీలుగా, జెడ్పీ చైర్మన్లుగా రికార్డుల్లో నిలిచిపోనున్నారు.

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల ప్రక్రియ
——————————————————–
డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నాటి నుంచి రాష్ట్ర ఎన్నికలసంఘం వరుస ఎన్నికల నిర్వహణను విజయవంతంగా చేపట్టింది. జనవరిలో పంచాయతీ ఎన్నికలు కాగా, ఏప్రిల్‌లో పార్లమెంట్ ఎన్నికలు.. ఆ వెంటనే పరిషత్ ఎన్నికలను ఎలాంటి అవరోధాలు లేకుండా నిర్వహించింది. పంచాయతీ, పరిషత్ ఎన్నికలో మూడు విడుతల్లో పూర్తిచేశారు. ఒకటి రెండు చిన్న సందర్భాలు మినహా.. స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడం ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. మరోవైపు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలు ఈ నెల 7, 8 తేదీల్లో ప్రశాంతంగా ముగిశాయి. గ్రామీణ ఓటర్లంతా టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టడంతో జిల్లా, మండల పరిషత్‌లు ఒకేరోజున ఏకగ్రీవమయ్యాయి. పలు కారణాలతో ఇంకా 22 ఎంపీపీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వాటిని కూడా ఈ వారంలో పూర్తిచేయనున్నారు.

గ్రామాల ప్రణాళికలో పరిషత్ సభ్యుల పాత్ర
———————————————————-
గ్రామ పంచాయతీల్లో ఎంపీటీసీ సభ్యుల భాగస్వామ్యం కల్పిస్తూ సీఎం కేసీఆర్ నూతన పంచాయతీరాజ్ చట్టంలో రూపొందించారు. దీని ప్రకారం ప్రతి ఐదేండ్లకు గ్రామ పంచాయతీ దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళిక, వార్షిక ప్రణాళికను ఎంపీటీసీ సభ్యులు ఆమోదించాల్సి ఉంటుంది. ఇలా పలు అధికారాలను ఎంపీటీసీలకు అప్పగించారు. మండల ప్రజా పరిషత్ అధ్యక్షులపై బాధ్యతలను పెంచిన ప్రభుత్వం… వాటిని నిర్లక్ష్యం చేసే చర్యలు తీసుకునేందుకు కూడా చట్టంలో మార్పులు చేసింది. అంతేకాకుండా కొన్ని పరిమితులను విధించింది. మండల పరిషత్ అధ్యక్షులు వరుసగా 15 రోజులు మండలానికి, కార్యాలయానికి రాకుంటే.. వారిని తొలిగించినట్లుగా భావిస్తూ ఉపాధ్యక్షుడికి బాధ్యతలను అప్పగించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇద్దరూ రాకుంటే సంబంధిత ఎంపీడీవోలు ఆ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. మండల పరిషత్‌కు వచ్చిన నిధులన్నీ పరిషత్ నిధిగా ఏర్పాటుచేసి, అందరి ఆమోదంతో వినియోగించాలి. వచ్చిన నిధులను ప్రభుత్వ ఖజానాలోనే జమచేయాలి. ఉద్యోగ భద్రత పథకం, ఇతర వేతనాలు, ఉపాధి నిధులను జాతీయ బ్యాం కులు, సహకార బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో జమచేయాల్సి ఉంటుందని కొత్త చట్టంలో నిబంధనలు విధించారు.