వివాదాస్పదమైన నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతంపై ఆధిపత్యం కోసం గత కొద్ది రోజులుగా అజర్‌బైజాన్, ఆర్మేనియా మధ్య భీకర పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కొనసాగుతన్న సైనిక ఘర్షణకు స్వస్తి పలికేందుకు గాను ఆర్మేనియా ప్రధాని నికోల్ పషిన్యన్ అజర్‌బైజాన్, రష్యాలతో శాంతి ఒప్పందాన్ని ప్రకటించాడు. దాంతో ఆగ్రహించిన నిరసనకారులు ఆర్మేనియన్ పార్లమెంటుపై దాడి చేసి స్పీకర్ అరరత్ మిర్జోయన్‌ను గాయపర్చారు.
రష్యన్ వార్తా సంస్థ ప్రకారం.. యెరెవాన్ నగరంలోని ఆర్మేనియన్ పార్లమెంట్ బయట మంగళవారం తెల్లవారుజామున నిర్వహించిన నిరసనలలో పాల్గొన్న ఆందోళనకారుల చేతిలో స్పీకర్ మిర్జోయన్ గాయపడినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ప్రధాని నికోల్ పషిన్యన్ తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. దాడిలో తీవ్రంగా గాయపడటంతో మిర్జోయన్‌కు ఆపరేషన్ జరిగినట్లు వెల్లడించారు.
ఆయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. ప్రధాని శాంతి ఒప్పందం ప్రకటించడంతో నిరసనకారులు యెరెవాన్ వీధుల్లో హింసాయుత చర్యలకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కొందటు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇక పార్లమెంట్‌పై దాడి చేసిన నిరసనకారులందరికి శిక్ష పడుతుందని పషిన్యన్ మరో ప్రకటనలో తెలిపారు.