కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కొత్తసార్సాల గ్రామ పరిధిలో అటవీభూములను చదును చేసేందుకు వచ్చిన అధికారులపై ఆదివారం పోడురైతులు దాడులకు పాల్పడ్డారు. జెడ్పీ వైస్‌చైర్మన్, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణారావుతోపాటు, కొంతమంది రైతులు కర్రలతో దాడిచేయడంతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్వో) చోలె అనితకు తీవ్ర గాయాలయ్యాయి. మరికొంతమంది అటవీ సిబ్బందితోపాటు, ముగ్గురు ట్రాక్టర్ డ్రైవర్లు గాయపడ్డారు. కాగా, దాడిలో తీవ్రంగా గాయపడిన ఎఫ్‌ఆర్వో చోలె అనితను హుటాహుటిన దవాఖానకు తరలించారు. పోలీసులు కోనేరు కృష్ణారావుతోపాటు, మరో 12 మందిపై కేసు నమోదుచేశారు. దాడిని అడ్డుకోలేకపోయిన కాగజ్‌నగర్ డీఎస్పీ సాంబయ్య, రూరల్ సీఐ వెంకటేశ్వర్లును ఐజీ నాగిరెడ్డి సస్పెండ్‌చేశారు. అటవీ అధికారులపై దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఘటన విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను వాకబుచేశారు. పీసీసీఎఫ్, డీజీపీతో మాట్లాడిన కేసీఆర్ బాధ్యులు ఎవరైనా కఠినచర్యలు తీసుకోవాలని, ఏ స్థాయి వ్యక్తులున్నా ఉపేక్షించవద్దని సూచించినట్టు తెలిసింది.