సెల్‌ఫోన్ చార్జర్ విషయమై మొదలైన చిన్న పాటి ఘర్షణ ఒక యువకుని దారుణ హత్యకు దారి తీసింది. మాటకుమాట పెరిగి కట్టెలు, కత్తితో దాడి చేయడంతో మాదాని మధుసూదన్ (22) మృతి చెందాడు. వల్లూరు ఎస్ఐ రాజగోపాల్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని లింగాయపల్లెకు చెందిన మాదాని మధుసూదన్ సమీప బంధువైన శివక్రిష్ణ సెల్‌ఫోన్ చార్జర్ తెచ్చుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం దీనిపై మధుసూదన్, శివక్రిష్ణ మధ్య చిన్న పాటి వాగ్వాదం జరిగింది. ఇది ఘర్షణకు దారి తీయడంతో గ్రామస్తులు ఇద్దరినీ మందలించి పంపించి వేశారు. దీంతో సెల్‌ఫోన్ చార్జర్‌ను మధుసూదన్ తిరిగి ఇచ్చేశాడు.
అయితే దీనిపై కక్ష పెంచుకున్న శివక్రిష్ణ గ్రామానికి చెందిన మరో నలుగురు యువకులతో కలిసి.. తమ ఇంటి ముందు నుంచి వెళుతున్న మధుసూదన్‌పై కట్టెలు, కత్తులతో దాడి చేశారు. కత్తులతో పొడవడంతో రక్తపు మడుగులో పడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితులు ద్విచక్ర వాహనాల్లో అక్కడి నుంచి పరారయ్యారు. కాగా మృతునికి తండ్రి లేకపోగా జీవనోపాధి కోసం వెళ్లిన తల్లి కువైట్‌లో ఉన్నారు. ప్రస్తు తం మధుసూదన్ అమ్మమ్మ దగ్గర ఉంటూ కడపలోని ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్నాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కడపకు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజగోపాల్ తెలిపారు. సంఘటన స్థలానికి కడప డీఎస్పీ సూర్యనారాయణ, కడప రూరల్ సీఐ వినయ్‌కుమార్‌రెడ్డి, ఎస్ఐ రాజగోపాల్ చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పరిశీలించి సంఘటన గురించి ఆరా తీశారు.