ఇక రవితేజపైనే ఆశలన్నీ..!

audience waiting for raviteja movie release

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

భారీ అంచనాల నడుమ విడుదలైన ‘అజ్ఞాతవాసి’, ‘జైసింహా’, ‘భాగమతి’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. ఈ సంవత్సరంలో మూడు అతి పెద్ద ఫ్లాప్‌ చిత్రాలుగా ఈ మూడు నిలిచాయి. ఈ సంవత్సరంలో విడుదలైన మొదటి మూడు పెద్ద చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద ప్రభావం చూపించకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది. 2018లో నెల రోజులు పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు సక్సెస్‌ దక్కింది లేదు. ఇక ప్రస్తుతం అందరి దృష్టి రవితేజ హీరోగా నటించిన ‘టచ్‌ చేసి చూడు’ చిత్రంపైనే ఉంది. సంక్రాంతికే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు, కాని పోటీ వద్దనుకుని రిపబ్లిక్‌ డేకు వాయిదా వేయడం జరిగింది. రిపబ్లిక్‌ డేకు కూడా కాదని ఫిబ్రవరి 2న విడుదల చేయబోతున్నారు.

రెండు సంవత్సరాల గ్యాప్‌ తర్వాత రవితేజ రెండు చిత్రాలను బ్యాక్‌ టు బ్యాక్‌ ఒప్పుకున్నాడు. అందులో మొదటిది ‘రాజా ది గ్రేట్‌’ సూపర్‌ హిట్‌ అయ్యింది. ఆ వెంటనే ‘టచ్‌ చేసి చూడు’తో రవితేజ బ్లాక్‌ బస్టర్‌ అందుకోవడం ఖాయం అంటూ ఆయన సన్నిహితులు మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన టచ్‌ చేసి చూడు ట్రైలర్‌ మరియు టీజర్‌లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

రాశిఖన్నా మరియు శీరత్‌ కపూర్‌లు హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మాస్‌ మరియు క్లాస్‌ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. 2018లో రవితేజ మొదటి సక్సెస్‌ను తన టచ్‌ చేసి చూడు చిత్రంతో దక్కించుకుంటాడా లేదా అనేది మరో నాలుగు రోజుల్లో తేలిపోనుంది. ఈ చిత్రంతో విక్రమ్‌ సిరి దర్శకుడిగా పరిచయం కాబోతున్న విషయం తెల్సిందే. ఇక పోలీస్‌ ఆఫీసర్‌గా రవితేజ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు.