Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వద్దన్న పనిచేయడం యువకులకు సరదా..ఆ వయసులో ఉండే..ఉత్సాహం, ఆవేశం, తెగువతో అనాలోచిత పనులు చేస్తుంటారు. బైక్ ను, కారును మితిమిరీన వేగంతో నడపడం, అర్ధరాత్రి దాకా రోడ్లపైన షికార్లు చేయడం, రన్నింగ్ బస్, ట్రైన్ ఎక్కేందుకు, దిగేందుకు ప్రయత్నించడం, నీళ్లు బాగా లోతుగా ఉన్న చోటుకి వెళ్లి ఈతకొట్టడం…ఇలా ప్రాణాలంటే లెక్కలేకుండా యువత చేసే పనులు గురించి చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాంతాడంత అవుతుంది. పెద్దవాళ్లు మందలించినప్పటికీ యువత తమ ప్రవర్తన మార్చుకోదు. తమ సరదా కోసం యువత చేసే ఈ పనులు శృతిమించనంతవరకూ ప్రమాదం లేదు. కానీ ఒక్కోసారి వాళ్లు అనాలోచితంగా చేసే కొన్ని పనులు అనర్థాలు తెచ్చిపెడతాయి. ప్రాణాల మీదకు తెస్తాయి. మితిమీరిన వేగంతో బైక్ నడుపుతూ ప్రమాదానికి గురై ఎందరో యువకులు మరణిస్తున్నారు. సరదాగా ఈత కోసం వెళ్లి నీళ్లల్లో మునిగి చనిపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా వారిలో మార్పు రాదు..తమదైన తరహాలోనే ముందుకు పోతుంటారు. యువతీయువకుల్లో ఈ తరహా ప్రవర్తన ఒక్క మన దేశానికే పరిమితం కాదు..అన్నిదేశాల్లోనూ ఇదే పరిస్థితి. కొన్ని దేశాల్లోనయితే..కొందరు చేసే చర్యలు అత్యంత హాస్యాస్పదం గానూ, కోపం తెప్పించేవి గానూ ఉంటాయి.
ఆస్ట్రేలియా యువకులకు సంబంధించి ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతున్న ఓ ఫొటో ఇందుకు ఉదాహరణ. ఆస్ట్రేలియా క్వీన్స్ లాండ్ లోని పోర్ట్ డాగ్లాస్ ప్రాంతంలోని సముద్రంలో మొసళ్లు ఎక్కువగా ఉంటాయి. వీటి కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో స్థానిక అధికారులు మొసళ్లను పట్టుకునేందుకు ఫ్లోటింగ్ బోను ఏర్పాటుచేశారు. మొసళ్లను ఆకర్షించేందుకు బోనులో మాంసం ఎరగా ఉంచారు. ఈ బోను సముద్రంలో తేలియాడుతూ ఉంటుంది. అయితే మొసళ్లకన్నా ముందుగా ఈ బోను నలుగురు యువకులను ఆకర్షించినట్టుంది. వారంతా ఆ బోటులో ఈతకొడుతూ ఫొటోకు ఫోజులిచ్చారు.
ఫేస్ బుక్ లో పోస్టయిన ఈ ఫొటో ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసిన పోర్ట్ డాగ్లాస్ అధికారులు యువకుల చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. యువకులది తెలివి తక్కువ, ప్రమాదకరమైన ప్రవర్తన అని, వారికి ఈ ఏడాది ఇడియట్స్ లేదా…ఈ శతాబ్దపు ఇడియట్స్ అవార్డు ఇచ్చినా తక్కువే అని డాగ్లాస్ మేయర్ జులియా మండిపడ్డారు. క్వీన్స్ లాండ్ పర్యావరణ మంత్రి కూడా దీనిపై స్పందించారు. బోనులో మొసళ్లను ఆకర్షించేందుకు మాంసం ఉంచామని, ఆ ప్రాంతంలో ఈతకొట్టడం చాలాప్రమాదకరం, చట్టవ్యతిరేకం అని ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో కూడా యువకుల తీరును తప్పుబడుతూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎంత సరదా అయినా..మరీ ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకునే పనులు చేయకూడదని అభిప్రాయపడుతున్నారు.