Political Updates: అయోధ్య రాముడికి హైదరాబాద్ తలుపులు

Political Updates: Ayodhya Ram's doors to Hyderabad
Political Updates: Ayodhya Ram's doors to Hyderabad

అయోధ్య రామాలయం విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం సమీపిస్తోంది. జనవరి 22వ తేదీన ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తరువాత నిర్మిస్తున్న ఎంతో ప్రాముఖ్యతగల దేవాలయం అయినందున ఈ నిర్మాణం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇంతటి ప్రసిద్ధ రామ మందిర నిర్మాణంలో తమ వంతు భాగస్వాములవుతున్నారు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోని అనురాధ టింబర్‌ ఎస్టేట్‌ నిర్వాహకులు.

అయోధ్యలో రామాలయానికి ప్రధాన ద్వారంతో పాటు ఇతర ద్వారాలను రూపొందించే అరుదైన అవకాశాన్ని అనురాధ టింబర్‌ ఎస్టేట్‌ నిర్వాహకులు సొంతం చేసుకున్నారు. 2023 జూన్‌లో అయోధ్య ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి సంపత్‌రాయ్‌ ఆదేశాల మేరకు వారు ఇచ్చిన డిజైన్‌ల ప్రకారం ద్వారాల పనులు షురూ చేశారు. అయోధ్య ఆలయ పరిసరాల్లోనే ప్రత్యేక కర్మాగారంలో తమిళనాడుకు చెందిన కుమార్‌ రమేష్‌, మహాబలిపురం, కన్యాకుమారికి చెందిన మరో 60 మంది శిల్పుల బృందం మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి తెప్పించిన ప్రత్యేక టేకుతో వీటికి రూపకల్పన చేస్తోంది.

గతంలో తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ప్రధాన ద్వారాలు రూపొందించి వీరు ప్రత్యేకత చాటుకున్నారు. ఈ క్రమంలో వారి ఆశీస్సులతోనే తమకు అయోధ్య రామాలయానికి ద్వారాలు చేసే అరుదైన అవకాశం లభించిందని అనురాధ టింబర్‌ ఎస్టేట్‌ నిర్వాహకుడు చదలవాడ శరత్‌బాబు తెలిపారు.