Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ పద్మావత్ …డిసెంబర్ 1న విడుదల కావాల్సిన పద్మావత్ రాజ్ పుత్ ల ఆందోళనలు, సీబీఎఫ్ సీ అనుమతి నిరాకరణతో వాయిదా పడి… రేపు విడుదలవుతోంది. ఇప్పటికే ప్రదర్శితమైన ప్రీమియర్ షోలు చూసిన వాళ్లు పద్మావత్ పైనా, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపైనా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చిత్ర ప్రత్యేక ప్రదర్శనను చూసిన సినీ ప్రముఖులు, విలేకరులు సినిమా అద్భుతంగా ఉందని ట్వీట్లు చేస్తున్నారు. భన్సాలీ తెరకెక్కించిన చిత్రాల్లో ఇది ఓ అద్భుతమైన సినిమా అని కొనియాడుతున్నారు. మరోపక్క సినిమా విడుదలకు వ్యతిరేకంగా రాజ్ పుత్ కర్ణిసేనలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. విడుదలను వ్యతిరేకిస్తూ 2వేలమంది రాజ్ పుత్ మహిళలు ఆత్మాహుతి చేసుకునేందుకు పేర్లు నమోదుచేసుకున్నారు.
థియేటర్లు తగలబెడతామన్న కర్ణిసేన హెచ్చరికల నేపథ్యంలో పోలీసలు భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. అటు ఈ సినిమాకు సంబంధించి బీ టౌన్ లో ఓ ఆసక్తికర వార్త హల్ చల్ చేస్తోంది. పద్మావత్ లో టైటిల్ రోల్ లో దీపికా పడుకునే నటించగా ఆమె భర్తగా, రాజ్ పుత్ మహారాజు రావల్ రతన్ సింగ్ గా షాహిద్ కపూర్, సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీగా రణ్ వీర్ సింగ్ నటించారు. అయితే రతన్ సింగ్, అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రల్లో నటించే అవకాశం ముందుగా బాలీవుడ్ బాద్ షా షారూఖ్ కు వచ్చింది.
కథను సిద్ధం చేసుకున్న భన్సాలీ రతన్ సింగ్ పాత్రలో నటించాలని షారూఖ్ ను కోరారు. అయితే కథ మొత్తం పద్మిణి, ఖిల్జీల చుట్టూ తిరుగుతుందన్న కారణంతో బాద్ షా ఆ ఆఫర్ తిరస్కరించారు. దీంతో భన్సాలీ ఆయనకు ఖిల్జీ పాత్రను ఆఫర్ చేశారు. అయితే ఏ కారణం చేతో ఆ పాత్రలో నటించేందుకు కూడా షారూఖ్ అంగీకరించలేదు. దీంతో బాజీరావ్ మస్తానీలో తన నటనతో అందరినీ కట్టిపడేసిన రణ్ వీర్ సింగ్ ఖిల్జీగానూ రాణించగలడన్న నమ్మకంతో భన్సాలీ ఆయన్ను తీసుకున్నారు. భన్సాలీ నమ్మకాన్ని నిజం చేస్తూ ఖిల్జీ పాత్రలో రణ్ వీర్ ఒదిగిపోయాడు. ఖిల్జీ నిజంగా ఇలాగే ఉంటాడా అన్నంతగా రణ్ వీర్ నటించాడు. ప్రీమియర్ షో చూసిన వారు ఖిల్జీ పాత్రను మర్చిపోలేకపోతున్నామని వ్యాఖ్యానిస్తున్నారు.