బాబుకు ఇబ్బందే….ప్రాజెక్టుల మీద థర్డ్ పార్టీ ఎంక్వైరీకి జగన్ నిర్ణయం

Babu in trouble

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తోన్న సీఎం జగన్ నిన్న జలవనరుల విభాగం అధికారులతో సమావేశమయ్యారు. సాగు, తాగు నీటి ప్రాజెక్టుల్లో అవినీతిని సహించేది లేదని అందుకే ప్రధాన ప్రాజెక్టుల విషయంలో థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేపట్టాలని ఆయన నిర్ణయించారు. ప్రాజెక్టులపై సమీక్షకు జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేయాలని జగన్‌ నిర్ణయించారు. సంబంధిత జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇంజినీరింగ్‌ నిపుణులతో కమిటీ వేయాలని ఆయన సూచించారు. భారీగా అంచనాలు పెంచిన ప్రాజెక్టులకు సంబంధించి రీటెండరింగ్ ప్రక్రియ చేపట్టే దిశగా ఏపీ సర్కారు అడుగులేస్తోంది. నిజాయతీతో, వాస్తవ అంచనాలతో పని చేయాలని అధికారులకు సీఎం సూచించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత జిల్లాల వారీగా సాగునీటి ప్రాజెక్టులను సమీక్షిస్తానని, గోదావరి జలాలను సాధ్యమైన మేర వాడుకోవడం, పోలవరం ప్రాజెక్టు పనుల తీరుపై ప్రత్యేకంగా సమీక్షిస్తానని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు నివేదికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 12 ప్రాజెక్టులపై థర్డ్‌పార్టీ ఎంక్వైరీ వేస్తారని తెలుస్తోంది. పోలవరం, పట్టిసీమ, వంశధార, వెలుగోడు, తోటపల్లి, అవుకు సుజల స్రవంతి, గాలేరు- నగరి, హంద్రీనీవా ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని సీఎం పేర్కొన్నారు. గత టీడీపీ సర్కారు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసం, కమీషన్ల కోసం ప్రాజెక్టుల అంచనాలు విపరీతంగా పెంచేసిందని ఆయన భావిస్తున్నారు. అన్ని ప్రాజెక్టులపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు.