టెన్షన్ పెట్టిన లోకేష్, బాబులు ఉన్న ఫ్లైట్

lokesh and babu in flight

నిన్న రాత్రి 7.20 గంటలకు విజయవాడ నుంచి ఎయిరిండియా విమానం 130 మంది ప్రయాణీకులతో హైదరాబాద్‌కు బయలుదేరింది. ఈ విమానంలోనే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ హైదరాబాద్‌కు బయలుదేరారు. విమానం బయలుదేరిన సమయంలో వాతావరణం ప్రతికూలంగా మారడంతో హైదరాబాద్‌కు రావాల్సిన విమానాన్ని దారి మళ్లించారు. దీంతో రాత్రి 9.20 గంటలకు ఆ విమానం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడే విమానాన్ని గంటన్నర పాటు నిలిపి ఉంచారు. వాతావరణం అనుకూలించడంతో విమానం తిరిగి రాత్రి 10.30 గంటల తర్వాత హైదరాబాద్‌కు బయలుదేరింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు గురువారం అర్ధరాత్రి 1.30 గంటలకు చేరుకుంది. రాత్రి 8.30 గంటలకు చేరుకోవాల్సిన విమానం దాదాపు ఏడు గంటల ఆలస్యంగా హైదరాబాద్‌కు చేరుకున్నట్టయ్యింది. విమానం క్షేమంగా హైదరాబాద్‌కు చేరుకోవడంతో ప్రయాణీకులు హమయ్య అనుకున్నారు. తమ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ క్షేమంగా చేరుకోవడంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. ఇక నుంచి వారంలో రెండు రోజులు హైదరాబాద్‌లో ఉంటానని తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన గురువారం రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు హైదరాబాద్‌లోనే ఉంటారు. శుక్ర, శనివారాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలకు బాబు అందుబాటులో ఉంటారు. ఆదివారం కుటుంబంతో గడిపి తిరిగి సోమవారం అమరావతికి చేరుకుంటారు.