ఏపీ అసెంబ్లీ ఎన్నికలో టీడీపీ ఘోర పరాజయం దిశగా టీడీపీ పయనిస్తోంది. దీంతో ఓకవేళ వైసీపీకి ఆధిక్యం వస్తే చంద్రబాబు నాయుడు సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. ఈరోజు సాయంత్రం రాజీనామా లేఖను గవర్నర్కు చంద్రబాబు పంపనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఘోరంగా వెనుకబడిపోవడం పట్ల బాబు తీవ్ర నిరాశకు గురైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన కాసేపట్లో మీడియా ముందుకు రానున్నారు. హుందాగా ఓటమిని అంగీకరించడంతో పాటు రాష్ట్రంలో ఏర్పాటు కాబోయే నూతన ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు చెబుతారని భావిస్తున్నారు. టీడీపీ ఓటమికి కారణాలను విశ్లేషించే అవకాశాలు ఉన్నాయి. నిన్నటివరకు ఎంతో ధీమాగా ఉన్న స్థితి నుంచి ఒక్కసారిగా పాతాళంలోకి పడినట్టుగా ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ కనిపిస్తుండడం తెలుగుదేశం పార్టీ వర్గాలకు మింగుడుపడడం లేదు. ఏపీలో ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం వైసీపీ 12 స్థానాల్లో గెలుపొంది, 138కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తుండగా టీడీపీ కేవలం 24 స్థానాల్లో ముందంజలో ఉంది. అదేవిధంగా లోక్సభ స్థానాల్లో కూడా టీడీపీ ఒక చోట మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతుంది. వైసీపీ మాత్రం 24 పార్లమెంట్ స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తుంది.