నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనూ విడుదలైన కేజీఎఫ్ సినిమా అన్ని భాషల్లోనూ ఘనవిజయం సాధించింది.
అయితే ఈ సినిమా ఏ ముహూర్తాన ప్రారంభించారోగాని మొదలు పెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. ఈ సినిమాను మొదట సైనైడ్ హిల్స్‌లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారు. కానీ అక్కడి ప్రజలు సినిమా షూటింగ్ కారణంగా పర్యావరణం దెబ్బతింటుందని షూటింగ్‌ను అడ్డుకోవటంతో ఆ షెడ్యూల్‌ను వాయిదా వేశారు.
తరువాత కోర్టును ఆశ్రయించి మరీ సైనైడ్ హిల్స్‌లో షూటింగ్‌కు అనుమతి సాధించారు. తాజాగా ఈ సినిమాకు మరోసారి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సినిమాలోని ఓ పాత్ర ఓ నిజజీవిత పాత్రను పోలి ఉండటంతో అతని కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు కన్నడ ఫిలిం చాంబర్‌తో పాటు కేజీఎఫ్ టీంకు నోటీసులు జారీ చేసింది.
1980లలో కరుడుగట్టిన నేరస్తుడిగా పేరున్న తంగం అనే వ్యక్తిని పోలిన పాత్ర కేజీఎఫ్‌లో ఉందంటూ అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేజీఎఫ్ తొలి భాగం సమయంలోనూ తంగ కుటుంబ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కానీ అప్పట్లో విషయం కోర్టు వరకు వెళ్లలేదు. కానీ ఇప్పుడు కోర్టు నుంచి నోటీసులు రావటంతో చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో అని సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.