అయిపోయింది.. అంతా అనుకున్నదే జరిగిపోయింది. ఎన్నో రోజులుగా సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలే నిజమయ్యాయి. ప్రభాస్ అభిమానులకు ‘సలార్’ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యాడ్ న్యూస్ చెప్పేసింది . ఇన్నాళ్లూ సలార్ పోస్ట్‌పోన్ అంటూ వార్తలు వస్తున్నా.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం అలా ఏం జరగదులే అని మనసులో బలంగా అనుకున్నారు. అధికారిక ప్రకటన రాకపోవడంతో వాళ్ల మనసులో ఏదో మూలకు ఒక ఆశ ఉండేది. అది కాస్త ఇప్పుడు నిరాశైపోయింది. కొన్ని కారణాల వల్ల అనుకున్న సమయానికి ‘సలార్’ విడుదల చేయలేకపోతున్నట్లు హోంబలే ఫిల్మ్స్ చావు కబురును చల్లగా చెప్పింది .
‘‘సలార్’పై మీరంతా చూపుతున్న అభిమానానికి ఎంతో ఆనందంగా ఉంది. కొన్ని కారణాల వల్ల మేము ఈ సినిమాను సెప్టెంబర్ 28న విడుదల చేయలేకపోతున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. మీకు మంచి ని అందివ్వడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. మీకోసం మా టీమ్ అంతా అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు తుది మెరుగులు దిద్దుతున్నాం. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని హోంబలే ఫిల్మ్స్ ట్వీట్ చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ యాక్షన్ సినిమా కోసం ఎన్నో రోజులుగా అభిమానులు ఎదురుచూస్తోన్న సంగతి తెలిసిందే. అసలీ చిత్రం సెప్టెంబర్ 28న రావాల్సి ఉంది.